తిరుపతి : జిల్లాలో ప్రజలకు అందుబాటులో ఉన్న మీ కోసం – 1100 సేవలను మరింత సమర్థంగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో సూచించారు. ప్రజలు దాఖలు చేసిన అర్జీలు పరిష్కారం కాకపోయినప్పటికీ, లేదా తమ ఫిర్యాదుల స్థితి తెలుసుకోవడానికి 1100 నంబర్‌కు కాల్ చేసి సమాచారం పొందవచ్చని తెలిపారు.
అర్జీదారులు తమ అర్జీలను నేరుగా Meekosam.ap.gov.in వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చని, సమస్యలను పరిష్కరించుకునేందుకు ఈ వేదికను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు.
డిసెంబర్ 8న తిరుపతి కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక:
కలెక్టర్ డా. వెంకటేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ నెల 8వ తేదీ సోమవారం తిరుపతి కలెక్టరేట్లో పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం (PG&RS) కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరగనున్న ఈ కార్యక్రమంలో పలువురు శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారు.
ప్రజలు తమ వివరాలు, సమస్యలకు సంబంధించిన అర్జీలతో కార్యక్రమానికి హాజరుకావాలని సూచించారు. గతంలో సమర్పించిన అర్జీలకు సంబంధించిన స్లిప్పులను కూడా తీసుకురావాలని సూచించడం జరిగింది.
సమస్య పరిష్కారమైన వెంటనే అర్జీదారుల మొబైల్ ఫోన్‌కు మెసేజ్ పంపబడుతుందని, వాట్సాప్ ద్వారా నోటీసులు, ఎండార్స్మెంట్లు అందిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. అలాగే, రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా ఎండార్స్మెంట్లు అర్జీలో పేర్కొన్న చిరునామాలకు పంపుతున్నామని చెప్పారు.
అర్జీ నమోదు సమయంలో వివరాలను స్పష్టంగా, సరిగ్గా పూరించాలని, పునరావృతంగా అర్జీలు ఇస్తున్నవారు పాత రసీదులను వెంట తెచ్చుకోవాలని సూచించారు.










