తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు సూచనల మేరకు, జిల్లాలో ఇటీవల సైబర్ మోసాలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ప్రజలకు, ముఖ్యంగా వాట్సాప్ వినియోగదారులకు కీలక హెచ్చరిక జారీ చేసింది.
వాట్సాప్‌లో “Hey… మీ ఫోటో చూశారా?”, “ఇది నువ్వేనా?” వంటి సందేశాలు మనకు తెలిసిన వ్యక్తుల పేరు, వారి ప్రొఫైల్ ఫోటో (డీపీ)తో వచ్చినప్పటికీ, ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిలోని లింకులపై క్లిక్ చేయరాదని పోలీసులు స్పష్టం చేశారు. పరిచయం ఉన్న వారి పేరు, ఫోటో కనిపించడంతో సులభంగా నమ్మేసే మనస్తత్వాన్ని సైబర్ నేరగాళ్లు దుర్వినియోగం చేస్తున్నారని జిల్లా ఎస్పీ తెలిపారు.
ఈ తరహా సందేశాల్లో ఉన్న లింకులు ‘ఘోస్ట్ పేయిరింగ్’ (Ghost Pairing) అనే ప్రమాదకరమైన సైబర్ స్కామ్‌కు సంబంధించినవని పోలీసులు హెచ్చరించారు. లింక్‌పై క్లిక్ చేస్తే నకిలీ WhatsApp Web లాగిన్ పేజీ ఓపెన్ అవుతుందని, అందులో వివరాలు ఎంటర్ చేసిన వెంటనే బాధితుడి వాట్సాప్ అకౌంట్ పూర్తిగా హ్యాకర్ల నియంత్రణలోకి వెళ్లిపోతుందని వివరించారు. అనంతరం హ్యాకర్లు బాధితుడి పేరుతో ఇతరులకు సందేశాలు పంపుతూ డబ్బు డిమాండ్ చేయడం, వివిధ మోసాలకు పాల్పడడం జరుగుతుందని తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ప్రజలకు పలు కీలక సూచనలు చేశారు. తెలియని లేదా అనుమానాస్పద లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దని, తెలిసిన వ్యక్తుల పేరుతో సందేశాలు వచ్చినా ముందుగా ఫోన్ చేసి లేదా ప్రత్యక్షంగా వెరిఫై చేసుకోవాలని సూచించారు. అలాగే వాట్సాప్ అకౌంట్ హ్యాక్ అయినట్టు అనుమానం వచ్చిన వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాలు మరింత చాకచక్యంగా జరుగుతున్నాయని, ప్రజలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు పేర్కొన్నారు. డిజిటల్ భద్రత ఇప్పుడు వ్యక్తిగత భద్రతతో సమానమని, చిన్న అజాగ్రత్త కూడా పెద్ద నష్టానికి దారి తీస్తుందని ప్రజలకు మరోసారి గుర్తు చేశారు.










