తిరుపతి జిల్లా : శ్రీవారి దర్శనానికి తిరుమలకి విచ్చేసే లక్షలాది భక్తుల భద్రతే ప్రధాన లక్ష్యంగా టీటీడీ నిరంతరం చర్యలు చేపడుతోందని టీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.
- తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో ఆదివారం ఉదయం ఈవో కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా పోలీస్ శాఖకు రూ.8 లక్షల విలువైన 20 బ్రెత్ అనలైజర్లను టీటీడీ తరఫున జిల్లా ఎస్పీకి అందజేశారు.
- ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, టీటీడీ సివిఎస్వో మురళీకృష్ణ, పాల్గొన్నారు.
ఈ సందర్భంగా టీటీడీ ఈవో మాట్లాడుతూ, ముఖ్యంగా తిరుమల ఘాట్ రోడ్లలో రోడ్డు ప్రమాదాల నివారణ, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకునే దిశగా ఈ బ్రెత్ అనలైజర్లు కీలకంగా ఉపయోగపడతాయని తెలిపారు. భక్తుల ప్రాణ రక్షణే టీటీడీకి అత్యున్నత ప్రాధాన్యమని, ఇందుకోసం పోలీస్ శాఖకు అవసరమైన ఆధునిక పరికరాలు అందించేందుకు టీటీడీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, మాట్లాడుతూ: “తిరుమల ఘాట్ రోడ్లు అత్యంత సున్నితమైనవి. అక్కడ మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాల ముప్పు ఎక్కువగా ఉంటుంది. టీటీడీ అందించిన ఈ ఆధునిక బ్రెత్ అనలైజర్లతో డ్రంకెన్ డ్రైవింగ్‌పై మరింత సమర్థవంతంగా నియంత్రణ సాధించగలుగుతాం. భక్తుల భద్రతకు టీటీడీ అందిస్తున్న ఈ సహకారం అభినందనీయం. పోలీస్ శాఖ ఈ పరికరాలను పూర్తి స్థాయిలో వినియోగించి ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది” అని అన్నారు.
ముఖ్యంగా “మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్ష ఉండదు. అలాంటి వారిపై కఠిన కేసులు నమోదు చేసి, జైలు శిక్షతో పాటు వాహనాన్ని సీజ్ చేసి కోర్టుకు నివేదిస్తాం. చిన్న అజాగ్రత్త మీ ప్రాణాలనే కాదు, ఇతరుల ప్రాణాలను కూడా హరించే ప్రమాదం ఉంది. దీనివల్ల నష్టం కలిగేది కేవలం తప్పు చేసిన వ్యక్తి కుటుంబానికే కాదు, నిర్దోషులైన ఇతరుల కుటుంబాలకు కూడా తీవ్ర వేదన కలుగుతుంది”. ఈ విషయాన్ని ప్రతి వాహనదారుడు గమనించాలి. ఇలాంటి నేరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు అని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.
అనంతరం జిల్లా ఎస్పీ బ్రెత్ అనలైజర్ల పనితీరును టీటీడీ ఈవోకు వివరించారు. మొత్తం 20 పరికరాలలో 04 తిరుమలలో, 04 అలిపిరిలో, 12 తిరుపతిలో ట్రాఫిక్ మరియు లా అండ్ ఆర్డర్ పోలీస్ శాఖలు వినియోగించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి రవి మనోహర ఆచారి (శాంతి భద్రతలు) డిఎస్పి రామకృష్ణ ఆచారి (ట్రాఫిక్) డిఎస్పి చంద్రశేఖర్ (ఏ ఆర్) మరియు తిరుపతి, పోలీస్ అధికారులు, ట్రాఫిక్ అధికారులు పాల్గొన్నారు.










