తిరుపతి – పాకాల : సావిత్రిబాయి పూలే ఆదర్శ గురువని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ ఎస్వీ రమేష్ కుమార్ అన్నారు. శనివారం పాకాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా సావిత్రిబాయి పూలే చరిత్రలో నిలిచిపోయారని ఆయన పేర్కొన్నారు. మహిళలకు విద్య ఎంత ముఖ్యమో గుర్తించి, సామాజిక అవరోధాలను ఎదుర్కొంటూ విద్యా బోధనకు నాంది పలికిన మహానీయురాలని కొనియాడారు. ఆమె ప్రారంభించిన అక్షర యజ్ఞం నేటికీ నిరాటంకంగా కొనసాగుతుండటం ఆమె సేవలకు నిదర్శనమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ మాశిలామని, మహిళా విభాగం సమన్వయకర్త డాక్టర్ రమణమ్మ మాట్లాడారు. అధ్యాపకులు చిట్టికళావతి, మోహన్ బెహరా, ఆదిశేఖర్ రెడ్డి, ఈశ్వర్ బాబు, రేఖ, మహబూబ్ బాషా, కుమార్ రాజా, ఢిల్లీ ప్రసాద్, వినోద్, నాగమణి తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.










