తిరుపతి:ప్రముఖ సామాజికవేత్త మబ్బు సూర్యనారాయణ రెడ్డి అందిస్తున్న సేవలు చిరస్మరణీయమని తిరుపతి అర్బన్ ఎంఈఓలు బాలాజీ నాయక్ అన్నారు. మబ్బు సూర్యనారాయణ రెడ్డి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఎస్‌ఎస్‌సీ విద్యార్థుల ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
10వ తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థులు మెరిట్‌లో ఉత్తీర్ణత సాధించాలనే ఉద్దేశంతో ట్రస్ట్ ఆధ్వర్యంలో 400 మంది విద్యార్థులకు ఎస్‌ఎస్‌సీ స్టడీ మెటీరియల్ పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ పుస్తకాలను ఎంఈఓలు బాలాజీ నాయక్, భాస్కర్ నాయక్‌లు, ట్రస్ట్ చైర్మన్ మబ్బు సూర్యనారాయణ రెడ్డి చేతుల మీదుగా దొడ్డాపురం ఉన్నత పాఠశాల, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, జడ్పీ ఉన్నత పాఠశాల, ఎంజీఎం ఉన్నత పాఠశాల విద్యార్థులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎంఈఓ బాలాజీ నాయక్ మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థుల జీవితానికి తొలి మెట్టు లాంటిదని, ఈ దశలో కష్టపడి చదివితే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకునేందుకు బలమైన పునాది వేయవచ్చని అన్నారు. ట్రస్ట్ చైర్మన్ మబ్బు సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ కష్టపడి మాత్రమే కాకుండా ఇష్టపడి చదివితే మంచి మార్కులు సాధించవచ్చని, తద్వారా తమ భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవచ్చని విద్యార్థులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో హెచ్‌ఎంలు రెడ్డెప్ప రెడ్డి, విజయ, సంధ్యా రాణి, విద్యార్థులు, ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.










