- ఎమ్మెల్యే పులివర్తి నాని చేతుల మీదుగా అవగాహన కరపత్రం ఆవిష్కరణ – పింక్ బస్ వైద్య శిబిరం ప్రారంభం
తిరుపతి జిల్లా, నారావారిపల్లి: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లిలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో స్విమ్స్ ఆసుపత్రి సౌజన్యంతో నేషనల్ గైనకాలజికల్ క్యాన్సర్ దినోత్సవం–2026 కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని క్యాన్సర్ అవగాహన కరపత్రాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో స్విమ్స్ డైరెక్టర్ ఆర్.వి. కుమార్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ఇలాంటి వైద్య శిబిరాలు మరియు అవగాహన కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. క్యాన్సర్ వంటి వ్యాధులను ముందుగానే గుర్తిస్తే పూర్తిగా నివారించవచ్చని, అందరూ సమయానికి పరీక్షలు చేయించుకోవడం అవసరమని తెలిపారు. రాష్ట్రాన్ని క్యాన్సర్ రహితంగా నిలపడానికి ప్రజల సహకారం అవసరమని అన్నారు.
అనంతరం ఎమ్మెల్యే క్యాన్సర్ రకాలు మరియు వాటి నివారణా మార్గాల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అవగాహన బ్యానర్లను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చిన రోగులను ఆప్యాయంగా పలకరిస్తూ వారికి అందుతున్న వైద్యం గురించి వివరాలు తెలుసుకున్నారు. అలాగే డాక్టర్ల పనితీరును కూడా అడిగి తెలుసుకున్నారు.
కార్యక్రమంలో భాగంగా మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్ అయిన “పింక్ బస్” వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ శిబిరం ద్వారా మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి అవగాహన కల్పించనున్నట్లు వైద్యులు తెలిపారు.ఈ కార్యక్రమంలో వైద్యులు, ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.








