చంద్రగిరి : తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని రాయలపురం గ్రామంలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ABN Andhra Jyothi ఆధ్వర్యంలో “అక్షరం అండగా… పరిష్కారమే అజెండాగా” అనే సమస్యల పరిష్కార సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, చంద్రగిరి ఎమ్మెల్యే Pulivarthi Nani ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలను జిల్లా జెడ్పీ సీఈవో, ఆర్డీవో, ఎమ్మార్వోతో పాటు కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు ఘనంగా స్వాగతించారు.
ఈ సందర్భంగా గ్రామస్థులు తమ ప్రాంతంలో ఎదుర్కొంటున్న పలు సమస్యలను కలెక్టర్, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ, సీసీ రోడ్లు, స్ట్రీట్ లైట్లు, కమ్యూనిటీ హాల్, వాటర్ ట్యాంక్, విజువల్ షెడ్, పింఛన్లు, కిడ్నీ వ్యాధులు, ఇంటి పట్టాలు, దోమల బెడద, స్మశానవాటిక వంటి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు.
అదేవిధంగా రాయలపురం ప్రభుత్వ పాఠశాలలో సరైన వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తల్లిదండ్రులు తెలిపారు. వెంటనే అవసరమైన సదుపాయాలు కల్పించాలని వారు అధికారులను అభ్యర్థించారు. అలాగే రాయలపురం పంచాయతీలో వెటర్నరీ కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలని స్థానిక నాయకులు కోరగా, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేలా చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేయాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేశారు.
మహల్ ప్రాంతంలో ప్రైవేట్ వాహనాలకు అనుమతి ఇస్తే టూరిజం అభివృద్ధి చెందడంతో పాటు స్థానిక వ్యాపారాలు కూడా అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్యే పులివర్తి నాని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
స్వర్ణ నారావారిపల్లి మాదిరిగానే “స్వర్ణ చంద్రగిరి మండలం”గా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపినట్లు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రజలకు వివరించారు. ఈ క్రమంలో నాగాలమ్మ మలుపు నుంచి శ్రీనివాసమంగాపురం వరకు, చంద్రగిరి టవర్ క్లాక్ నుంచి తొండవాడ ఫ్లైఓవర్ వరకు రోడ్డు విస్తరణ పనులకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కలెక్టర్‌ను కోరారు.
రాయలపురం గ్రామంలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రజలకు హామీ ఇచ్చారు. అనంతరం గ్రామస్థుల నుంచి అర్జీలు స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి అధికారులు, కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








