తిరుపతి : పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు పాల్గొని పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను అర్పించిన మహనీయుడు పొట్టి శ్రీరాములు గారి జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు ఆయన చేసిన మహోన్నత త్యాగం చరిత్రలో చిరస్మరణీయమని కొనియాడారు. సమాజం మరియు ప్రజల కోసం త్యాగస్ఫూర్తితో సేవలందించిన ఆయన సేవలను ఎప్పటికీ మరిచిపోలేమని పేర్కొన్నారు. యువత పొట్టి శ్రీరాములు ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని దేశం, సమాజ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు వెంకట్రావు (పరిపాలన), శ్రీనివాసులు (సాయుధ దళం), డీఎస్పీ చంద్రశేఖర్ (అడ్మిన్), ఏవో సురేష్ కుమార్, సీఐలు, ఆర్ఐలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.








