తిరుపతి జిల్లా, పాకాల : పట్టణంలో శాంతి భద్రతలు, ట్రాఫిక్ నిర్వహణను మెరుగుపరచేందుకు పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు పాకాలలో సీఐ చిన్న గోవిందు, ఎస్ఐల ఆధ్వర్యంలో వివిధ ఆటో యూనియన్ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పాకాల పరిధిలోని ఆటో యూనియన్ ప్రతినిధులు, డ్రైవర్లు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీఐ చిన్న గోవిందు మాట్లాడుతూ, పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో ఆటో డ్రైవర్ల పాత్ర అత్యంత ముఖ్యమని తెలిపారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఆటోల్లో అధిక సంఖ్యలో ప్రయాణికులను ఎక్కించరాదని, మద్యం సేవించి వాహనం నడపకూడదని కఠినంగా హెచ్చరించారు.
అలాగే వాహనాలకు సంబంధించిన పత్రాలు అన్నీ సక్రమంగా ఉండాలని, డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ వంటి డాక్యుమెంట్లు ఎప్పుడూ వెంట ఉంచుకోవాలని సూచించారు. రోడ్లపై ఎక్కడపడితే అక్కడ ఆటోలను నిలిపివేయకుండా, నిర్ణీత స్థలాల్లోనే పార్కింగ్ చేయాలని తెలిపారు.
పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఆటో యూనియన్ నాయకులు తమ సభ్యులకు అవగాహన కల్పించాలని కోరారు. ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తిస్తూ మంచి పేరు సంపాదించుకోవాలని, పోలీస్ శాఖతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని సూచించారు.
సమావేశంలో ఆటో యూనియన్ నాయకులు తమ సమస్యలను సీఐ దృష్టికి తీసుకువెళ్లగా, వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. పోలీస్ శాఖ తరఫున అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాకాల ఎస్ఐలు, ఆటో యూనియన్ నాయకులు, డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.







