తిరుపతి జిల్లా పాకాల మండలంలో అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. చంద్రగిరి మండలం తొండవాడకు చెందిన 46 ఏళ్ల చలమచర్ల ప్రవీణ్ కుమార్ పులివర్తివారిపల్లిలోని తన మామిడి తోటలో మృతదేహంగా కనిపించడం పలు అనుమానాలకు దారితీస్తోంది.
సమాచారం ప్రకారం, ప్రవీణ్ కుమార్ గత నెల 28న ఇంటి నుంచి బయలుదేరి వెళ్లారు. ఏప్రిల్ 2 వరకు కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడిన ఆయన, ఆ తర్వాత నుంచి ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. శనివారం తోట వద్దకు వెళ్లి పరిశీలించగా, షెడ్ సమీపంలో కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం లభ్యమైంది.
మృతదేహం పరిస్థితి అనుమానాస్పదంగా ఉండటంతో బంధువులు హత్య అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దుస్తులు సరిగా లేకపోవడం, శరీరం ఉబ్బిపోయి ఉండటం పలు సందేహాలకు తావిస్తోంది.
మార్చి 30న ప్రవీణ్ కుమార్ మరో ఐదారు గుర్తు తెలియని వ్యక్తులతో కలిసి తోటలో మద్యం సేవించినట్లు సమాచారం. ఆ వ్యక్తులే హత్యకు పాల్పడ్డారా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఘటనపై కేసు నమోదు చేసిన పాకాల సీఐ చిన్న గోవిందు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మృతికి గల అసలు కారణాలు వెల్లడవుతాయని పోలీసులు తెలిపారు.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపగా, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.








