తిరుపతి : మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా తిరుపతి కలెక్టరేట్ వద్ద ధర్నాకు వెళ్తున్న విద్యార్థి సంఘం నాయకులు ఇద్దరిని గుర్తుతెలియని వ్యక్తులు కారులో కిడ్నాప్ చేసిన ఘటన తిరుపతిలో తీవ్ర కలకలం రేపింది.
ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, సంఘటన జరిగిన వెంటనే అడిషనల్ ఎస్పీ రవి మనోహర చారి ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. వేగవంతమైన దర్యాప్తు చేపట్టిన పోలీసులు, నారావారిపల్లె సమీపంలో ఉన్న మోహన్ బాబు ఫామ్ హౌస్ వద్ద కిడ్నాప్‌కు గురైన విద్యార్థి సంఘం నాయకులు అక్బర్ మరియు వినోద్ ఉన్నట్టు గుర్తించారు.
గంట వ్యవధిలోనే కిడ్నాప్‌కు గురైన విద్యార్థి నాయకులను సురక్షితంగా రక్షించిన పోలీసులు, ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తులతో పాటు ఉపయోగించిన వాహనాలను కూడా అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ, కిడ్నాప్‌కు పాల్పడిన వారితో పాటు ఈ చర్యకు ప్రేరేపించిన వారిపైనా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, సమగ్ర దర్యాప్తు చేపట్టి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ప్రవర్తించే వారెవరైనా సరే వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.








