వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ వాణిజ్యంపై కీలక నిర్ణయం ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా దిగుమతులపై టారిఫ్‌ను 10 శాతం నుంచి 15 శాతానికి పెంచుతున్నట్లు వెల్లడించారు. ఈ పెంపు తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపారు.
తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్ లో చేసిన పోస్టులో, ఇటీవల అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు.
“దశాబ్దాలుగా అనేక దేశాలు అమెరికాను దోచుకున్నాయి. నేను వచ్చాకే పరిస్థితి మారింది,” అని ఆయన వ్యాఖ్యానించారు. శుక్రవారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును “అసంబద్ధమైనది, అమెరికాకు వ్యతిరేకమైనది”గా ఆయన విమర్శించారు.
తీర్పును సమగ్రంగా పరిశీలించిన తర్వాతే 10 శాతం గ్లోబల్ టారిఫ్‌ను 15 శాతానికి పెంచుతున్నట్లు తెలిపారు. ఇది పూర్తిగా చట్టబద్ధమైన చర్య అని స్పష్టం చేశారు. రాబోయే నెలల్లో మరిన్ని సుంకాలు విధించే అవకాశం ఉందని, ఇది తన ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ (MAGA) విధానంలో భాగమని పేర్కొన్నారు.
ఈ నిర్ణయం ప్రపంచ వాణిజ్యం, వస్తువుల ధరలు మరియు ఇతర దేశాలతో అమెరికా సంబంధాలపై ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.








