తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లకు గడువు నేటి సాయంత్రంతో ముగిసింది. పలు పార్టీలు చివరి నిమిషంలో అభ్యర్థులను మార్చడం… చివరి నిమిషంలో టిక్కెట్లు కేటాయించిన కారణంగా కొంతమంది హడావుడిగా నామినేషన్లు దాఖలు చేశారు. ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ వేయడానికి గడువు ఇచ్చారు. మూడు గంటల లోగా నామినేషన్ వేసేందుకు సంబంధిత రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి వెళ్లి వరుసలో నిలుచున్న అభ్యర్థులకు నామినేషన్ దాఖలు చేయడానికి అనుమతి ఇచ్చారు. నామినేషన్లకు నేడు (శుక్రవారం) చివరి రోజు కావడంతో ఆయా పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నెల 13వ తేదీన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ఉంటుంది. 15వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది.