తిరుపతి : శ్రీ వేంకటేశ్వర స్వామి సేవలో పాల్గొనే శ్రీవారి సేవకులకు మరింత మెరుగైన, నిపుణులైన శిక్షణ అందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా, శ్రీవారి సేవ వ్యవస్థలో పలు సంస్కరణలు చేపడుతున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా, ఐఐఎం అహ్మదాబాద్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల సహకారంతో రూపొందించిన ప్రత్యేక శిక్షణా మాడ్యూల్‌ను బుధవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఆవిష్కరించింది.
ఈ కార్యక్రమాన్ని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈఓ శ్యామలరావు, అదనపు ఈఓ వెంకయ్య చౌదరి కలిసి ప్రారంభించారు. అనంతరం బీఆర్ నాయుడు మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు శ్రీవారి సేవలో మార్పులు తీసుకొస్తున్నామని తెలిపారు. 2000 సంవత్సరంలో ప్రారంభమైన ఈ సేవ ద్వారా ఇప్పటివరకు 17 లక్షల మంది వాలంటీర్లు పాల్గొన్నారని, ప్రస్తుతం రోజుకు 3,500 మంది వివిధ విభాగాల్లో సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ఇకపై శ్రీవారి సేవకులకు, గ్రూప్ సూపర్‌వైజర్లకు నిరంతరం శిక్షణ ఇచ్చేందుకు టీటీడీ వెబ్‌సైట్‌లో ‘ట్రైనర్ మాడ్యూల్’ను అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. ఈ మాడ్యూల్ రూపకల్పనలో ఐఐఎం (అహ్మదాబాద్), డైరెక్టర్ ఆఫ్ ప్లానింగ్ ఆఫ్ గవర్నమెంట్ పాలుపంచుకున్నాయని ఆయన పేర్కొన్నారు.
హోటళ్ల కేటాయింపులో పారదర్శకత
మరోవైపు, తిరుమలలో భక్తులకు నాణ్యమైన ఆహారాన్ని తక్కువ ధరకే అందించేందుకు కట్టుబడి ఉన్నామని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. ఇటీవల తిరుమలలోని ఐదు జనతా, ఐదు బిగ్ క్యాంటీన్లను పూర్తి పారదర్శకంగా కేటాయించినట్లు ఈఓ, అదనపు ఈఓ తెలిపారు. ఇందుకోసం కొత్త పాలసీని రూపొందించి, నిపుణుల కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాతే బ్రాండెడ్ హోటళ్లను ఎంపిక చేశామన్నారు. ఆహార నాణ్యత, ధరల విషయంలో నిర్దేశించిన నిబంధనలను అతిక్రమిస్తే, ఆయా హోటళ్లకు కేటాయించిన లైసెన్సులను తక్షణమే రద్దు చేస్తామని వారు హెచ్చరించారు.