- ప్రభుత్వం దిగిరాకపోతే చలో అసెంబ్లీ ముట్టడి
- ఆసరా పింఛన్ పెంపు చేయాలని డిమాండ్
- ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో తూప్రాన్ తహసిల్దార్ కార్యాలయం ముట్టడి
- ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు చెట్లపల్లి యాదగిరి మాదిగ నేతృత్వంలో ర్యాలీ – ధర్నా
- “వెంటనే పింఛన్ పెంచాలి” అంటూ నినాదాలు
తూప్రాన్ డివిజన్ : మెదక్ జిల్లా తూప్రాన్ మండల కేంద్రంలో ఆసరా పింఛన్ పెంపు కోసం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) ఆధ్వర్యంలో భారీ ఆందోళన జరిగింది. జిల్లా అధ్యక్షులు చెట్లపల్లి యాదగిరి మాదిగ నేతృత్వంలో వందలాది మంది పింఛన్ దారులు హైవే నుండి భారీ ర్యాలీగా బయలుదేరి తూప్రాన్ తహసిల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. “పింఛన్ పెంచాలి – పేదల బతుకులు గట్టెక్కాలి” అంటూ నినాదాలతో కార్యాలయ ప్రాంగణం మార్మోగిపోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని, ఇంతకుముందు ఇచ్చిన పింఛన్ సరిపోవడం లేదని పింఛన్ దారులు బాధ వ్యక్తం చేశారు. మాకు ఒక్కటే ఆదాయం అదే పింఛన్. అది పెంచకపోతే బతుకు భారమవుతుంది అని తహసిల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చెట్లపల్లి యాదగిరి మాదిగ మాట్లాడుతూ పేదల జీవనోపాధికి పింఛన్ పెంపు తప్పనిసరి. ప్రభుత్వం వెంటనే స్పందించి పింఛన్ మొత్తాన్ని పెంచకపోతే మరింత పెద్ద ఉద్యమాలు చేపడతాం అని హెచ్చరించారు. ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు సర్గల పరశురాములు మాదిగ, కాలకంటి సత్యం మాదిగ, అర్గల శంకర్ మాదిగ, కృష్ణ మాదిగ తదితరులు మాట్లాడుతూ పింఛన్ లబ్ధిదారులు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. ముసలి వారు, దివ్యాంగులు, విధవలు అందరూ ఈ పింఛన్‌కే ఆధారపడుతున్నారు. కనీసం మానవత్వం దృష్ట్యా ప్రభుత్వం వెంటనే పెంచాలి” అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బుడగ జంగం సుజాత, నాగరాణి, హుస్సేన్, లక్ష్మి, శివరాజు, పోచయ్య, అనిత, భూమయ్య తదితర పింఛన్ దారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వారంతా కలిసి తహసిల్దార్ కార్యాల యం వద్ద ధర్నా నిర్వహించి, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. భవిష్యత్ కార్యాచరణ కోసం ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు చెట్లపల్లి యాదగిరి మాదిగ మాట్లాడుతూ పింఛన్ పెంపుపై ప్రభుత్వం స్పందించకపోతే జిల్లా, రాష్ట్ర స్థాయిలో పెద్ద ఉద్యమాలు చేస్తాం. అవసరమైతే చలో కలెక్టరేట్, హైదరాబాద్ లో చలో అసెంబ్లీ కార్యక్రమాలకు పిలుపునిస్తాం అని హెచ్చరించారు.