తూప్రాన్ : తూప్రాన్ పట్టణంలో ప్రజా ఆరోగ్య రక్షణ దిశగా లయన్స్ క్లబ్ మరో వినూత్న సేవా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆదివారం ఉదయం తూప్రాన్‌లోని సుష్మ హాస్పిటల్ ఆవరణలో లయన్ డాక్టర్ సుష్మాదేవి సమన్వయంతో ఉచిత డయాబెటిక్ స్క్రీనింగ్ క్యాంప్‌ను లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.
క్యాంప్‌కు స్థానిక ప్రజలు విస్తృతంగా స్పందించగా, సుమారు 40 మంది పేషెంట్లకు ఉచితంగా రక్తంలో చక్కర స్థాయిల పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారికి వ్యక్తిగతంగా రిపోర్టులను వివరించి, డయాబెటిస్ తీవ్రతను బట్టి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహార నియమాలు, జీవనశైలి మార్పులపై వైద్యులు సూచనలు అందించారు. డయాబెటిస్ నిర్ధారణ అయిన వారికి అవసరమైన మందులను కూడా పూర్తిగా ఉచితంగా అందించడం ఈ క్యాంప్ ప్రత్యేకతగా నిలిచింది.
గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్న డయాబెటిస్ సమస్యను గుర్తించి, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ క్యాంప్‌ను నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రజా ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో లయన్ డాక్టర్ సుష్మాదేవి, లయన్ డాక్టర్ ప్రదీప్ సింహ, లయన్ డాక్టర్ జానకిరామ్ (సీనియర్ జర్నలిస్ట్), సుష్మ హాస్పిటల్ వైద్య సిబ్బంది పాల్గొని సేవలందించారు. క్యాంప్‌ను విజయవంతం చేసిన వైద్యులు, సిబ్బంది అందరికీ లయన్స్ క్లబ్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.









