చిన్న శంకరంపేట/తూప్రాన్ డివిజన్ : మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని చిన్నశంకరంపేట మండల రైతు వేదికలో సిఎంఆర్ఎఫ్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద మంజూరైన చెక్కులను మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు బుధవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. చిన్న శంకరంపేట మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా ఈ చెక్కులు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రావు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా నిరుపేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు పొందేందుకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోందన్నారు. అలాగే పేద కుటుంబాల ఆడపిల్లల వివాహాలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా భరోసా కల్పిస్తున్నట్లు తెలిపారు.
ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా ఉండాలనేదే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో చిన్న శంకరంపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.









