మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని వెల్దుర్తి మండలం శేంషా రెడ్డిపల్లి తాండ గ్రామ పంచాయతీ పరిధిలోని బండమీదిపల్లిలో బుధవారం రాత్రి జరిగిన దారుణ హత్య స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గ్రామానికి చెందిన రైతు గంపల బాలేష్ (47)ను గుర్తుతెలియని వ్యక్తి గొడ్డలితో నరికి హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
పోలీసుల కథనం ప్రకారం, బాలేష్ బుధవారం ఉదయం బోరు మోటర్ బంద్ చేసి వస్తానని చెప్పి పొలానికి వెళ్లారు. అయితే సాయంత్రం అయినప్పటికీ ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పలుమార్లు ఫోన్ చేయగా స్పందన లేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు అర్ధరాత్రి పొలం వద్దకు వెళ్లి చూడగా, రక్తపు మడుగులో పడి ఉన్న బాలేష్ మృతదేహం కనిపించింది.
ఈ విషయం తెలుసుకున్న బాలేష్ కుమార్తె స్థానికులకు సమాచారం అందించగా, వారు వెంటనే పోలీసులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, తూప్రాన్ సీఐ రంగా కృష్ణ గౌడ్‌తో పాటు శివ్వంపేట, వెల్దుర్తి మండలాల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.
మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు గొడ్డలితో బలంగా కొట్టి హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్‌కు తరలించారు.
ఈ హత్యకు సంబంధించి అప్పల సాయిలు అనే వ్యక్తి వెల్దుర్తి పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు సీఐ రంగా కృష్ణ తెలిపారు. అక్రమ సంబంధమే హత్యకు కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తామని తెలిపారు.








