- యూపీ మత మార్పిడి ముఠా సూత్రధారి ఛంగూర్ బాబా అరెస్ట్
- ఒకప్పుడు సైకిల్‌పై ఉంగరాలు అమ్ముకున్న వ్యక్తి
- 40 బ్యాంకు ఖాతాల్లో రూ.106 కోట్ల నిధులు గుర్తింపు
- మధ్యప్రాచ్య దేశాల నుంచి డబ్బు వచ్చినట్టు దర్యాప్తులో వెల్లడి
- రంగంలోకి ఈడీ, ఏటీఎస్ సహా పలు దర్యాప్తు సంస్థలు
- నిందితుల ఆస్తులు జప్తు చేస్తామని యూపీ సీఎం హెచ్చరిక
ఉత్తర్ ప్రదేశ్ – బలరాంపూర్ : గతంలో సైకిల్‌పై తిరుగుతూ ఉంగరాలు, తాయెత్తులు అమ్ముకునే ఒక సాధారణ వ్యక్తి ఇప్పుడు ఏకంగా రూ.106 కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించాడు. ఉత్తరప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మత మార్పిడుల ముఠా గుట్టు రట్టు కావడంతో జమాలుద్దీన్ అలియాస్ ఛంగూర్ బాబా అక్రమాల పుట్ట పగిలింది. ఈ కేసు తీవ్రత దృష్ట్యా ఇప్పుడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా రంగంలోకి దిగింది.
బలరాంపూర్ జిల్లాకు చెందిన ఛంగూర్ బాబా, అతని సహచరి నీతూ అలియాస్ నస్రీన్‌ను పోలీసులు ఇటీవల లక్నోలో అరెస్ట్ చేశారు. పేదలు, నిస్సహాయ కార్మికులు, వితంతువులే లక్ష్యంగా డబ్బు, పెళ్లి ఆశ చూపి లేదా బెదిరించి ఈ ముఠా మత మార్పిడులకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఛంగూర్ బాబాకు చెందిన 40 వేర్వేరు బ్యాంకు ఖాతాల్లోకి మధ్యప్రాచ్య దేశాల నుంచి రూ.106 కోట్లకు పైగా నిధులు వచ్చినట్టు అధికారులు గుర్తించారు.
ఈ కేసును ఉత్తర ప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టీఎఫ్) దర్యాప్తు చేస్తుండగా, ఇప్పుడు మనీ లాండరింగ్ కోణంలో ఈడీ కూడా విచారణ ప్రారంభించింది. ఈ నిధులతో బలరాంపూర్‌లోని ప్రభుత్వ భూమిలో నిర్మించిన అక్రమ కట్టడాన్ని అధికారులు బుధవారం బుల్డోజర్‌తో కూల్చివేశారు. అంతేకాకుండా, మహారాష్ట్రలోని లోనావాలాలో రూ.16 కోట్లకు పైగా విలువైన ఆస్తిని కొనుగోలు చేసినట్టు ఆధారాలు లభించాయి.
ఈ వ్యవహారంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా స్పందించారు. “నిందితుడి కార్యకలాపాలు సమాజానికే కాక, దేశానికి కూడా వ్యతిరేకమైనవి. అతని, అతని ముఠా సభ్యుల ఆస్తులను జప్తు చేసి కఠిన చర్యలు తీసుకుంటాం” అని ఆయన స్పష్టం చేశారు. ఈ రాకెట్‌కు ఉగ్రవాద సంబంధాలు ఉన్నాయా అనే కోణంలోనూ ఏటీఎస్ దర్యాప్తు చేస్తోంది.