ఢిల్లీ : కేవలం మూడు నిమిషాల వీడియో కాల్ .. ఎన్నో ఏళ్ల కెరీర్‌కు ముగింపు పలికింది. కనీసం ప్రశ్న అడిగే అవకాశం కూడా ఇవ్వకుండా, మాట్లాడేందుకు వీల్లేకుండా మైకులు, కెమెరాలు ఆఫ్ చేసి ఉద్యోగంలో నుంచి తొలగించారు. ఓ అమెరికన్ కంపెనీ అనుసరించిన ఈ అమానవీయ విధానంపై ఓ భారత టెకీ రెడిట్‌లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది.
వివరాల్లోకి వెళితే, అమెరికాకు చెందిన ఓ టెక్ కంపెనీలో పనిచేస్తున్న భారత ఉద్యోగి తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు. అక్టోబర్ నెలలో ఒక రోజు ఉదయం 11:01 గంటలకు కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) అకస్మాత్తుగా ఓ వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారని తెలిపారు. ఆ కాల్లో జాయిన్ అయిన వెంటనే ఉద్యోగులందరి మైక్రోఫోన్లు, కెమెరాలను డిజేబుల్ చేశారని ఆయన వివరించారు.
కంపెనీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా అధికశాతం భారతీయ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సీఓఓ ప్రకటించారని సదరు ఉద్యోగి తెలిపారు. అయితే, ఇది ఉద్యోగుల పనితీరు ఆధారంగా తీసుకున్న నిర్ణయం కాదని ఆయన స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు. తమ వాదన వినిపించేందుకు గానీ, కనీసం సందేహాలు అడిగేందుకు గానీ ఎలాంటి అవకాశం ఇవ్వకుండా కేవలం మూడు నిమిషాల్లోనే కాల్ ముగించారని ఆవేదన వ్యక్తం చేశారు.
అనూహ్యంగా ఉద్యోగం కోల్పోయిన వారికి ఒక నెల జీతంతో పాటు, వాడుకోని సెలవులకు సంబంధించిన నగదు చెల్లిస్తామని కంపెనీ హామీ ఇచ్చినట్లు ఆ టెకీ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. “నా జీవితంలో ఇలా ఉద్యోగం కోల్పోవడం ఇదే మొదటిసారి. ఎలాంటి జాలి, దయ లేకుండా అత్యంత కర్కశంగా తొలగించారు. కనీసం మానసికంగా సిద్ధమయ్యే అవకాశం కూడా ఇవ్వలేదు” అని ఆయన వాపోయారు.
ఈ పోస్ట్ వైరల్ అవడంతో నెటిజన్ల నుంచి ఆయనకు భారీగా మద్దతు లభిస్తోంది. “ధైర్యంగా ఉండండి, ఇది ముగింపు కాదు.. కొత్త ఆరంభం” అంటూ చాలామంది కామెంట్లు పెడుతున్నారు. టెక్ రంగం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న తరుణంలో ఈ తరహా తొలగింపులు ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.