అమెరికా : మరణ భయంతో వృద్ధ నేతలు అధికారాన్ని పట్టుకుని వేలాడుతుండటం వల్లనే ప్రపంచంలో సగానికి పైగా సమస్యలు తలెత్తుతున్నాయని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పేర్కొన్నారు. లండన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఒబామా మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై పరోక్షంగా సెటైర్లు విసిరారు. పిరమిడ్లతో పాటు ప్రతి దానిపై తమ పేరు ఉండాలని ఈ వృద్ధ నేతలు భావిస్తుంటారని, ఇదే సమస్యలకు దారితీస్తుందని చెప్పారు.
అధికారంతో పాటు వారు దేనినీ వదులుకోరని ఒబామా వ్యాఖ్యానించారు. మరోవైపు, పారాసెటమాల్ వాడకంపై ఇటీవల ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఒబామా తప్పుబట్టారు. గర్భిణిలు పారాసెటమాల్ వాడితే వారి గర్భంలో పెరుగుతున్న శిశువులు ఆటిజానికి గురవుతారని ట్రంప్ వ్యాఖ్యానించిన విషయం విదితమే. అయితే, ఈ వ్యాఖ్యలకు శాస్త్రీయ ఆధారమేమీ లేదని ఒబామా చెప్పారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల ప్రజల్లో గందరగోళం నెలకొంటుందని, ఆటిజంతో బాధపడుతున్న పిల్లల తల్లుల్లో ఆందోళన నెలకొంటుందని ఒబామా అభిప్రాయపడ్డారు.