ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ విరమణ ప్రకటన వెలువడిన కొన్నిగంటల వ్యవధిలోనే మళ్లీ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ట్రంప్ మధ్యవర్తిత్వంతో కుదిరిన యుద్ధ విరమణ ఒప్పందాన్ని కొన్ని గంటల వ్యవధిలోనే ఇరాన్, ఇజ్రాయెల్ పరస్పరం ఆరోపించుకున్నాయి. కాల్పుల విరమణ ఉల్లంఘనపై ట్రంప్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇరాన్-ఇజ్రాయెల్ దేశాలు మళ్లీ కాల్పుల విరమణ ఉల్లంఘిస్తున్నాయన్నారు. ముఖ్యంగా ఇజ్రాయెల్ తీరుపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇరాన్-ఇజ్రాయెల్ పరస్పరం దాడులు: కాల్పుల విరమణ ప్రకటన తర్వాత ఇరాన్‌లోని పరిపాలన కేంద్రాలపై దాడులు చేయాలని ఇజ్రాయెల్ రక్షణమంత్రి కట్జ్‌తమ సైన్యాన్ని ఆదేశించారు. టెహ్రాన్ నడిబొడ్డున ఉన్న పరిపాలన కేంద్రాలతోపాటు ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడాలని ఆయన సూచించారు. ఇరాన్ దాడులతో ఉత్తర ఇజ్రాయెల్‌లోని పలు ప్రాంతాల్లో సైరన్లు మోగాయి.
పేలుళ్లశబ్దాలు వినిపించినట్లు ఐడీఎఫ్ ప్రకటించింది. అలాగే, ఇరాన్ వైపు నుంచి వచ్చిన క్షిపణులను అడ్డుకున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ట్రంప్ మధ్యవర్తిత్వంతో యుద్ధ విరమణకు అంగీకరించినట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటన చేసిన తర్వాత ఇరాన్ వైపు క్షిపణులు దూసుకువచ్చినట్లు ఇజ్రాయెల్ ఆరోపించింది. అయితే ఇజ్రాయెల్ ఆరోపణలను ఇరాన్ తోసిపుచ్చింది.
యుద్ధవిరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత ఇజ్రాయెల్‌పై దాడులు చేయలేదని తెలిపింది. ఈ మేరకు ఇరాన్ అధికారిక ఛానల్ ఓ కథనం ప్రసారం చేసింది. ఇరాన్ మిలిటరీ, పారామిలిటరీ రివల్యూషనరీ గార్డ్స్ జనరల్ స్టాఫ్ ఇజ్రాయెల్ ఆరోపణలను తోసిపుచ్చినట్లు ఇరాన్ అధికారిక ఛానల్ తెలిపింది.
పైలెట్లను ఇజ్రాయెల్ వెనక్కి రప్పించాలి: ట్రంప్: ఇరాన్-ఇజ్రాయెల్‌లు యుద్ధ విరమణను ఉల్లంఘించినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. నాటో సదస్సులో పాల్గొనేందుకు హేగ్‌కు బయలుదేరటానికి ముందు శ్వేతసౌధంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఇరుదేశాలు దాడులు కొనసాగించటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇరాన్‌తోపాటు ఇజ్రాయెల్ కూడా యుద్ధ విరమణను ఉల్లంఘించినట్లు ట్రంప్ తెలిపారు. ఇజ్రాయెల్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ బాంబులు వేయొద్దని సూచించారు. ఒకవేళ బాంబులు వేస్తే ప్రధాన ఉల్లంఘన అవుతుందని పేర్కొన్నారు. వెంటనే పైలెట్లను వెనక్కి పిలవాలని ఇజ్రాయెల్‌కు ట్రంప్ సూచించారు.