-
16కిపైగా రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితి
-
8,000కు పైగా విమానాలు రద్దు
-
విద్యుత్ సరఫరాపై తీవ్ర ప్రభావం
-
న్యూయార్క్, బోస్టన్ వైపు దూసుకొస్తున్న తుపాను
అమెరికా చరిత్రలోనే అత్యంత తీవ్రమైన మంచు తుపానుల్లో ఒకటి దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. టెక్సాస్ నుంచి న్యూ ఇంగ్లాండ్ వరకు సుమారు 2,000 మైళ్ల విస్తీర్ణంలో ఈ తుపాను ప్రభావం చూపుతోంది. దాదాపు 20 కోట్ల మందికి పైగా ప్రజలు తీవ్రమైన శీతల వాతావరణం, మంచు హెచ్చరికల మధ్య జీవిస్తున్నారు.
పరిస్థితి తీవ్రత దృష్ట్యా వాషింగ్టన్ డీసీతో పాటు అలబామా, జార్జియా, కెంటకీ, న్యూయార్క్, టెక్సాస్ సహా 16కిపైగా రాష్ట్రాలు ‘స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ’ ప్రకటించాయి. ఆర్కిటిక్ ప్రాంతం నుంచి పోలార్ వోర్టెక్స్ కారణంగా దూసుకొస్తున్న అతి శీతల గాలులు శక్తివంతమైన తుపాను వ్యవస్థతో కలవడంతో ఈ విపత్తు ఏర్పడింది.
దేశంలోని తూర్పు ప్రాంతమంతా భారీ హిమపాతం, గడ్డకట్టే వర్షం, స్లీట్తో అల్లకల్లోలంగా మారింది. సదరన్ ప్లెయిన్స్, లోయర్ మిసిసిపీ, టెన్నెస్సీ వ్యాలీ, ఆగ్నేయ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో “విపత్తు స్థాయి”లో మంచు పేరుకుపోయే అవకాశం ఉందని జాతీయ వాతావరణ సేవలు హెచ్చరించాయి.
ఈ తుపాను కారణంగా విమాన రవాణా పూర్తిగా అస్తవ్యస్తమైంది. ఫ్లైట్ అవేర్ సమాచారం ప్రకారం వారాంతంలో ఇప్పటివరకు 8,000కుపైగా విమానాలు రద్దయ్యాయి. విద్యుత్ సరఫరా కూడా తీవ్రంగా ప్రభావితమవుతోంది. టెక్సాస్‌లో ఇప్పటికే వేలాది మంది చీకట్లో చిక్కుకున్నారు.
ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ (FEMA) సహాయక బృందాలను మోహరించగా, పలు రాష్ట్రాల్లో నేషనల్ గార్డ్ దళాలను రంగంలోకి దింపారు. ఈ తుపాను సోమవారం వరకు కొనసాగి న్యూయార్క్, బోస్టన్ వంటి ప్రధాన నగరాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.









