H-1B Visa: అమెరికాలో హెచ్-1బీ వీసాలపై పనిచేస్తున్న భారతీయ వృత్తి నిపుణుల్లో చాలా మంది మనసు మాతృభూమి వైపు చూస్తోంది. కఠినమైన వీసా నిబంధనల కారణంగా ఒకవేళ ఉద్యోగం కోల్పోవాల్సి వస్తే, భారత్‌కు తిరిగి వచ్చేందుకే అధిక శాతం మంది మొగ్గు చూపుతున్నట్లు ఇటీవల జరిగిన ఓ సర్వేలో వెల్లడైంది. అమెరికాలో నెలకొన్న అనిశ్చితి, ఉద్యోగ భద్రత లోపించడమే ఈ మార్పునకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
అజ్ఞాత కమ్యూనిటీ యాప్ ‘బ్లైండ్’ నిర్వహించిన ఈ సర్వేలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. సర్వే ప్రకారం, ఉద్యోగం కోల్పోతే మీ తదుపరి ప్రణాళిక ఏంటని ప్రశ్నించగా, 45 శాతం మంది ఎలాంటి సంకోచం లేకుండా భారత్‌కే తిరిగి వస్తామని స్పష్టం చేశారు. మరో 26 శాతం మంది వేరే దేశానికి వలస వెళ్తామని పేర్కొనగా, మిగిలిన 29 శాతం మంది ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. అమెరికా ప్రభుత్వం హెచ్-1బీ వీసాలపై విధిస్తున్న కఠిన నిబంధనల వల్లే ఈ పరిస్థితి తలెత్తుతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
అయితే, అమెరికాను వీడి రావడానికి కొన్ని ఆందోళనలు కూడా ఉన్నాయని వారు అభిప్రాయపడ్డారు. వీరిలో 25 శాతం మంది జీతాల్లో భారీ కోతలు ఉంటాయని భయపడుతుండగా, 24 శాతం మంది జీవన ప్రమాణాలు తగ్గిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే, సాంస్కృతిక, కుటుంబపరమైన సర్దుబాట్లు (13 శాతం), తక్కువ ఉద్యోగ అవకాశాలు (10 శాతం) వంటివి కూడా తమను కలవరపెడుతున్నాయని వారు పేర్కొన్నారు.
ఈ సర్వేలో మరో ముఖ్యమైన విషయం కూడా బయటపడింది. భవిష్యత్తులో మళ్లీ అమెరికా వర్క్ వీసాను ఎంచుకుంటారా? అని అడగ్గా, కేవలం 35 శాతం మంది మాత్రమే సానుకూలంగా స్పందించారు. దీన్నిబట్టి, అమెరికాలోని ఉద్యోగ అభద్రత వంటి కారణాలతో భారత నిపుణుల్లో అమెరికాపై ఆకర్షణ క్రమంగా తగ్గుతోందని స్పష్టమవుతోంది.