ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. శాంతి ఒప్పందంలో భాగంగా ఉక్రెయిన్‌కు భద్రతా హామీలు కల్పించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అంగీకరించారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. సోమవారం వైట్‌హౌస్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ, పలు యూరోపియన్ దేశాల అధినేతలతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశం అనంతరం ట్రంప్ ఈ కీలక ప్రకటన చేశారు. ఇది శాంతి చర్చల్లో చాలా ముఖ్యమైన ముందడుగు అని ఆయన అభివర్ణించారు.
ఈ భద్రతా హామీల విషయంలో యూరప్ దేశాలు కీలక పాత్ర పోషిస్తాయని, అత్యధిక బాధ్యతను అవే తీసుకుంటాయని ట్రంప్ స్పష్టం చేశారు. “మేము వారికి సహాయం చేస్తాం. భద్రత విషయంలో ఎలాంటి లోటు లేకుండా చూస్తాం” అని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో కుదిరిన ఒప్పందం భవిష్యత్తులో ఉక్రెయిన్‌పై ఎలాంటి దాడులు జరగకుండా నిరోధిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. శాంతి ఒప్పందంలో భాగంగా “ప్రస్తుత సరిహద్దు రేఖను పరిగణనలోకి తీసుకుని” భూభాగాల మార్పిడిపై కూడా చర్చించనున్నట్లు ట్రంప్ సూచనప్రాయంగా తెలిపారు.
ట్రంప్‌తో చర్చలు చాలా బాగా జరిగాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆశాభావం వ్యక్తం చేశారు. తమ దేశానికి బలమైన సైన్యం, ఆయుధాలు, శిక్షణ వంటి సమగ్రమైన భద్రత అవసరమని, దీనికి అమెరికా వంటి పెద్ద దేశాల మద్దతు ఎంతో కీలకమని ఆయన అన్నారు. ఈ సమావేశాల తర్వాత తాను పుతిన్‌కు ఫోన్ చేస్తానని, అవసరమైతే పుతిన్, జెలెన్‌స్కీలతో కలిసి త్రైపాక్షిక సమావేశానికి తాను సిద్ధంగా ఉన్నానని ట్రంప్ ప్రకటించారు.
గత ఫిబ్రవరిలో జరిగిన సమావేశంతో పోలిస్తే, ఈసారి వైట్‌హౌస్‌లో వాతావరణం చాలా స్నేహపూర్వకంగా కనిపించింది. గత భేటీలో మిలటరీ దుస్తుల్లో వచ్చిన జెలెన్‌స్కీ, ఈసారి సూట్‌లో రావడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆయన వేషధారణపై ట్రంప్ కూడా సరదాగా వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, ఫిన్లాండ్ దేశాధినేతలు పాల్గొన్నారు.