విశాఖపట్నం – పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గురుకుల పాఠశాలలోని పలువురు విద్యార్థులు ఇటీవల పచ్చకామెర్ల వ్యాధితో బాధపడుతూ విశాఖపట్నం కింగ్ జార్జ్ హాస్పిటల్ (కేజీహెచ్)లో చికిత్స పొందుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, కురుపాం శాసనసభ్యురాలు తోయక జగదీశ్వరి శుక్రవారం కేజీహెచ్‌కి వెళ్లి బాధిత విద్యార్థులను పరామర్శించారు.
హాస్పిటల్‌లో విద్యార్థినులతో మాట్లాడిన ఎమ్మెల్యే, వారి ఆరోగ్య పరిస్థితిని దగ్గరుండి తెలుసుకున్నారు. అనంతరం కేజీహెచ్ సీనియర్ వైద్యురాలు డాక్టర్ ఐ. వాణి మరియు ఇతర వైద్యులతో సమావేశమై బాలికల చికిత్స వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థినులు త్వరగా కోలుకునేలా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని అవసరమైన వైద్య సదుపాయాలు, సహాయ సహకారాలు అందిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
చికిత్స అనంతరం శుక్రవారం నాడు పదిమంది విద్యార్థులను డిశ్చార్జ్ చేశారని ఎమ్మెల్యే వెల్లడించారు. బాలికల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు.
ఈ సందర్బంగా ఆమెతో కలిసి రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు కడ్రక మల్లేశ్వరరావు, గుమ్మలక్ష్మీపురం టీడీపీ మండల అధ్యక్షులు అడ్డాకుల నరేష్, బీజేపీ ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు నిమ్మక సింహాచలం, ఏఎంసీ వైస్ చైర్మన్ గౌరీ శంకర్, డుమ్మంగి సర్పంచ్ పాలక క్రాంతి కుమార్, జనసేన కొమరాడ మండల కన్వీనర్ తెంటు శ్రీకర్, గరుగుబిల్లి మండల కన్వీనర్ బోను శివతో పాటు కూటమి నాయకులు శంకర్, అనంత్, రవి, శేఖర్, శంకరరావు, గోపాలకృష్ణ, హితేష్ కుమార్, సుందర్ రావు తదితరులు పాల్గొన్నారు.
ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వానికి ముఖ్యమే: ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే జగదీశ్వరి, “అన్ని రాజకీయ భేదాలను పక్కన పెట్టి, విద్యార్థినుల ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో ప్రతి ఒక్కరు కలిసికట్టుగా పనిచేయడం అభినందనీయం” అన్నారు.