విజయనగరం/పార్వతీపురం మన్యం : తమ న్యాయపరమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) పిలుపు మేరకు పార్వతీపురం మన్యం జిల్లా విద్యుత్ ఉద్యోగులు ఈ రోజు విజయనగరం లోని స్థానిక విద్యుత్ భవన్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.
ఏపీ పవర్ జేఏసీ ఆధ్వర్యంలో జరగనున్న నిరసన కార్యక్రమాలలో భాగంగా శుక్రవారం మహిళలు నిరాహారదీక్షలు చేపట్టారు. ఉద్యోగులు తమ డిమాండ్లతో కూడిన ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు.
ఈ ధర్నా కార్యక్రమంలో ఏపీ పవర్ జేఏసీ జిల్లా చైర్మన్ సుర గాల లక్ష్మణ కన్వీనర్ బండారు రాజేష్ కుమార్ నాయకత్వం వహించారు. వీరితో పాటు, కో-చైర్మన్ పప్పల అప్పలస్వామి నాయుడు, వైస్ చైర్మన్లు మందపల్లి నిర్మలా మూర్తి రూంకన అప్పలనాయుడు, పూసపాటి సీతారామరాజు సహా పెద్ద సంఖ్యలో విద్యుత్ ఉద్యోగులు, జేఏసీ సభ్యులు పాల్గొని తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతాయని జేఏసీ నాయకులు ఈ సందర్భంగా హెచ్చరించారు.