పార్వతీపురం మన్యం జిల్లా – జియ్యమ్మవలస మండలం: మహిళల ఆరోగ్యం, కుటుంబ శ్రేయస్సు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా జియ్యమ్మవలస మండలం, అలమండ పంచాయితీ, సీటీమండగూడలో బుధవారము ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించారు. మహిళల ఆరోగ్యం ఎంత ముఖ్యమో, దాని ద్వారానే బలమైన కుటుంబాలు ఏర్పడతాయి. రావాడ రాంభద్రపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ చీకటి శంకరరావు ఆధ్వర్యంలో ఈ శిబిరం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ శంకరరావు మాట్లాడుతూ, మహిళలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఆరోగ్యకరమైన మహిళలు ఉన్నప్పుడే బలమైన కుటుంబాలు సాధ్యమవుతాయి అని ఆయన అన్నారు. ఈ ప్రత్యేక వైద్య శిబిరంలో మహిళలకు పలు రకాల ఆరోగ్య పరీక్షలు, సేవలు అందించారు. ముఖ్యంగా, అసంక్రమిత వ్యాధులైన రక్తపోటు, మధుమేహం వంటి వాటి కోసం స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. అలాగే మహిళలను ఎక్కువగా ప్రభావితం చేసే నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ వంటి వాటిని గుర్తించడానికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. సరైన పోషకాహారం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. కిశోర బాలికల ఆరోగ్య పరీక్షలు, యుక్తవయస్సులో ఉన్న బాలికలకు అవసరమైన ఆరోగ్య సేవలు అందించారు. సరైన ఆహారపు అలవాట్లపై సలహాలు, సూచనలు ఇచ్చారు.టీబీ వ్యాధిని గుర్తించడానికి పరీక్షలు చేశారు.గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నారులకు అవసరమైన వైద్య సేవలు అందించారు.మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపై కౌన్సిలింగ్ ఇచ్చారు. వృద్ధుల ఆరోగ్య సమస్యల కోసం ప్రత్యేక పరీక్షలు నిర్వహించారు.
ఈ శిబిరంలో వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సేవలు మరింత సులభంగా అందుబాటులోకి వచ్చాయని స్థానికులు సంతృషీ వ్యక్తం చేశారు.