విజయనగరం జిల్లా : ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం, విజయనగరం ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం మంగళవారం నాడు అత్యంత వైభవంగా, కన్నుల పండువగా జరిగింది. ఈ చారిత్రక వేడుకకు లక్షలాదిగా తరలివచ్చిన భక్తులతో విజయనగరం పట్టణం జనసంద్రంగా మారింది. భక్తి పారవశ్యంతో మార్మోగిన జయజయధ్వానాల నడుమ సిరిమాను ఊరేగింపు అంగరంగ వైభవంగా సాగింది. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వంటి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
సిరిమాను ఉత్సవంలో ప్రధాన ఘట్టమైన ఊరేగింపులో, ఆలయ ప్రధాన పూజారి బంటుపల్లి వెంకట్రావు సిరిమానును అధిరోహించారు. అమ్మవారి ప్రతిరూపంగా ఆయన భక్తులను ఆశీర్వదించారు. చారిత్రక చదరగుడి వద్ద మొదలైన ఈ ఊరేగింపు, విజయనగరం కోట వరకు సాగింది. సిరిమానుకు ముందుగా పాలధార, తెల్ల ఏనుగు, జాలరివల, అంజలి రథం వంటివి కదులుతుండగా, భక్తుల కోలాహలం మధ్య ఉత్సవం ముందుకు సాగింది. అమ్మవారిని దర్శించుకోవడం ద్వారా తమ కోరికలు నెరవేరతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఈ వేడుకను తిలకించేందుకు ఆలయ వంశపారంపర్య ధర్మకర్త అశోక్ గజపతిరాజు కూడా హాజరయ్యారు.
స్వల్ప అపశ్రుతి.. కూలిన వేదిక
ఈ వైభవమంతా ఒకవైపు సాగుతుండగా, ఉత్సవంలో స్వల్ప అపశ్రుతి చోటుచేసుకుంది. శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ దంపతులు, మాజీ ఎంపీ బెల్లం చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే అప్పల నరసయ్య వంటి పలువురు ప్రముఖులు ఆసీనులైన వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనతో అక్కడ కాసేపు గందరగోళం నెలకొంది. అయితే, ఎవరికీ తీవ్రమైన గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో బందోబస్తు విధుల్లో ఉన్న విజయనగరం గ్రామీణ సీఐ అశోక్‌కు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే అధికారులు పరిస్థితిని అదుపులోకి తేవడంతో ఉత్సవం ప్రశాంతంగా కొనసాగింది.
అంతకుముందు తొలేళ్ల వేడుక
సిరిమానోత్సవానికి ముందు సోమవారం ‘తొలేళ్లు’ ఉత్సవాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఇందులో భాగంగా, ఆలయ ధర్మకర్తలైన పూసపాటి అశోక్ గజపతిరాజు కుటుంబ సభ్యులు తమ పుట్టింటి ఆడపడుచు అయిన అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. తొలేళ్ల సందర్భంగా అర్ధరాత్రి పూజారి వెంకట్రావు రైతులకు విత్తనాలను ప్రసాదంగా అందిస్తారు. ఆ విత్తనాలను పొలాల్లో చల్లిన తర్వాతే వ్యవసాయ పనులు ప్రారంభిస్తామని రైతులు నమ్ముతారు. ఈ వేడుకలో విజయనగరం ఎంపీ అప్పలనాయుడు, ఎమ్మెల్యే అతిధి వంటి ప్రజాప్రతినిధులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 14వ తేదీన పెదచెరువులో తెప్పోత్సవం జరగనుంది.