వికారాబాద్/పరిగి : దోమ మండలం, గుండాల గ్రామంలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా తయారైంది. గత మూడు నెలలుగా నాలుగో వార్డులో అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ పైప్‌లైన్ పగిలిపోవడంతో మురుగునీరు రోడ్డుపై నిలిచి ఉంది. దీంతో వర్షాకాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంచి నీటి సరఫరా కూడా సక్రమంగా లేకపోవడంతో, మురుగునీటి గుంతల కారణంగా దోమలు విపరీతంగా పెరిగిపోయి, డెంగీ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ఈ సమస్యపై పంచాయతీ కార్యదర్శికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
