విజయవాడ, అక్టోబర్ 12: ఈ నెల 12వ తేదీన విజయవాడలో 93వ వైమానిక దళ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వాయు దళానికి సేవలందించిన మాజీ సైనికులు భారీగా హాజరై, దేశభక్తి భావాలతో ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ వేడుకకు ముఖ్య అతిధిగా ఎయిర్ కమోడోర్ టి. శ్రీవాస్తవ (రిటైర్డ్) హాజరయ్యారు. రాష్ట్ర ఎక్స్ సర్వీసెస్ లీగ్ అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస వర ప్రసాద్ ప్రత్యేక అతిధిగా పాల్గొని, మాజీ సైనికుల సంక్షేమం, సమస్యల పరిష్కారాలపై విస్తృతంగా మాట్లాడారు. ఆయన గత కొన్ని సంవత్సరాలుగా మాజీ సైనికుల హక్కుల కోసం చేస్తోన్న కృషిని అభినందిస్తూ పాల్గొన్నవారు ప్రశంసలు కురిపించారు.
అయితే ఈ వేడుక కేవలం సాంప్రదాయానికి మాత్రమే పరిమితం కాకుండా, మాజీ సైనికుల శ్రేయస్సు కోసం ప్రభుత్వానికి వినతులు పంపే దిశగా చర్చలు కూడా సాగాయి. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు ముసునూరు రవి (డీఎస్పీ రిటైర్డ్), ముఖ్య కార్యదర్శి తుమ్మల సాంబశివరావు, ఈసీ సభ్యులు జి.వి. ఆంజనేయులు, కె.ఎస్. చలం, జి. విజయ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
దేశ రక్షణకు తమ ప్రాణాలను అంకితమైన వాయుసేన సిబ్బందికి గౌరవం చూపిస్తూ నిర్వహించిన ఈ వేడుక, యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది.