- తిరుమల కొండపై భక్తుల ఇబ్బందికి కారణం యాజమాన్యమే …!
- కార్మికులను బానిసల్లా చూస్తున్నారు
- లైంగిక వేధింపుల నిరోధక కమిటీలు లేవు
- ‘అమాయకులైన కార్మికుల పట్ల వివక్ష తగదన్న సిఐటియు’
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో దేవుని సన్నిధిలో పని చేస్తున్న కార్మికుల పట్ల టిటిడి యాజమాన్యం వివక్ష చూపుతోందనీ.,, ఆ కారణంగానే పలుమార్లు తిరుమల కొండపై అలజడి ఏర్పడిందనీ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి ఆరోపించారు. తిరుపతి యశోదా నగర్ లోని సిఐటియు జిల్లా కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత కొన్నిరోజులుగా సులభ్ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ.. రోడ్డెక్కడానికి ప్రధాన కారణం యాజమాన్య నిర్లక్ష్య ధోరణే కారణమని విమర్శించారు.
పాతిక సంవత్సరాలకు పైగా పనిచేస్తున్న కార్మికుల కష్ట,నష్టాలను టిటిడి యాజమాన్యం ఏనాడూ పట్టించుకోకపోవటం వల్లే తిరుమల కొండపై భక్తులకు ఇబ్బందులు ఏర్పడ్డాయని తెలిపారు. సులభ్ కార్మికులకు ఇఎస్ఐ, పిఎఫ్ అమలు కావటం లేదని, కాంట్రాక్టరుకు ఇస్తున్న మొత్తం కార్మికులకు చేరటం లేదని అన్నారు. బ్రహ్మోత్సవాలలో భక్తుల మల, మూత్రాలను శుద్ధిచేసి తిరుమలను పర్యావరణ హితంగా మారుస్తున్న సులభ్ కార్మికులు లడ్డూ, వడకు, బ్రహ్మోత్సవ బహుమానానికి నోచుకోలేదన్నారు తిరుమల కొండపై ఎఫ్ఎంఎస్, సులభ్ కార్మికులే లేకపోతే ఎంత తీవ్రమైన ఇబ్బందులు వస్తాయో తెలిసినా టిటిడి యాజమాన్యం వారి కష్టాలను పట్టించుకోకపోవటం దారుణమని అన్నారు. వైవి సుబ్బారెడ్డి రెండవ సారి ఛైర్మన్ గా ఉన్నా ఒక్కసారి కూడా కార్మికుల గురించి చర్చించి తీర్మానాలు చేసిన పాపాన పోలేదని ద్వజమెత్తారు.
2021వ సంవత్సరంలో ఎఫ్ఎంఎస్ కార్మికులు 14 రోజులు పాటు ఆందోళన చేశారని, నాటి ఇఓ జవహర్ రెడ్డి కార్మిక సమస్యల పరిష్కారానికి కమిటీని వేశారని, ఒకటిన్నర సంవత్సరం కావస్తున్నా ఈ కమిటి ఒక్కసారి కూడా సమావేశం కాలేదంటే కార్మికుల పట్ల యాజమాన్యానికి ఉన్న చిత్తశుద్ది ఏ పాటిదో అర్థం అవుతుందని అన్నారు.
సిఐటియు జిల్లా అధ్యక్షులు జి. బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ కార్మికుల సమస్యలను పట్టించుకోవాలని టిటిడి ఇఓకు, ఉన్నతాధికార్లకు చెబుతున్నా చెవిటి వాని ముందు శంఖం ఊదినట్టుగా తయారైందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 900 రోజులుగా అటవీ కార్మికులు పోరాటం సాగిస్తున్నా పట్టీపట్టనట్లు అధికారులు తయారయ్యారని 362 మంది కార్మికుల్లో 162 మందిని పర్మినెంట్ చేసి, 200 మందికి బోర్డు తీర్మానం ప్రకారం టైంస్కేలు అమలు చేయకుండా కార్పొరేషన్లో బలవంతంగా కలపాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
సిఐటియు జిల్లా నేత టి. సుబ్రమణ్యం మాట్లాడుతూ ….
20 ఏళ్లకు పైగా టైంస్కేలు ఉద్యోగులుగా పనిచేస్తున్న వారిని పర్మినెంట్ చేయకుండా వారి తర్వాత చేరిన వారిని పర్మినెంటు చేశారని, డిపార్ట్మెంటుకో విధానం అమలు చేస్తూ, గందరగోళానికి కారకులయ్యారని అన్నారు. టిటిడి నిర్వాకాలపై కోర్టులలో కేసులు కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్నాయని ‘లా ’ అధికారులు, టిటిడి న్యాయవాదులు పలుమార్లు చెబుతున్నా, టిటిడి యాజమాన్యం చెవికెక్కించుకోవటం లేదని అన్నారు. వేలాదిమంది మహిళా కార్మికులు పనిచేస్తున్నా, టిటిడి లో లైంగిక వేధింపుల నిరోధక కమిటీలు లేకపోవటం ఆశ్చర్యం
కల్గిస్తున్నదని వారన్నారు.
అధికారులకు, పాలక మండలి సభ్యులకు చెప్పి, చెప్పి విసిగిపోయి కార్మికులు రోడ్డెక్కుతుంటే, అభం, శుభం తెలియని ‘ వారిపై ‘ఎస్మా’ ప్రయోగిస్తామని టిటిడి ప్రకటనలు జారీ చేయడం దారుణమని అన్నారు. కలెక్టర్ జి.ఓ.లో కనీస వేతనం రూ. 679 లు చెల్లించాలని చెబుతుండగా, టిటిడిలో రూ. 300ల లోపు చెల్లించటం ఏ రకంగా సహేతుకమన్నారు. ధర్మాన్ని కాపాడాల్సిన చోట అధర్మం రాజ్యమేలుతున్నదన్నారు. ఇప్పటికైనా అధికారులు కార్మికుల కష్టాలను పట్టించుకొని సమస్యల పరిష్కారానికి తోడ్పడాలని కోరారు. మీడియా సమావేశంలో సిఐటియు నగర అధ్యక్ష, కార్యదర్శులు మునిరాజ, వేణుగోపాల్, రఘు, బుజ్జి, పార్థసారథి, రామకృష్ణ, బాబూరావు తదితరులు పాల్గొన్నారు.