contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

వైసిపి నేత పెద్దిరెడ్డి .. కుటుంబ సభ్యులపై భూ కబ్జా కేసు

మాజీ మంత్రి, వైసీపీ నేత, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులపై అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేశారు. చిత్తూరు జిల్లా పరిధిలోని పులిచెర్ల మండలం మంగళంపేట అటవీ భూమిని ఆక్రమించి, జీవవైవిధ్యానికి తీవ్ర నష్టం కలిగించారన్న ఆరోపణలపై ఈ నెల 6న కేసులు నమోదు చేశారు. పెద్దిరెడ్డితో పాటు ఆయన కుమారుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, సోదరుడు, తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి, పెద్దిరెడ్డి సోదరుడి భార్య ఇందిరమ్మను ఈ కేసులో నిందితులుగా పేర్కొన్నారు. మంగళంపేటలోని అటవీ భూమిలోకి నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశించి, స్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవడమే కాకుండా, పర్యావరణానికి కూడా హాని చేశారని అటవీశాఖ అధికారులు తమ నివేదికలో స్పష్టం చేశారు.

ఈ వ్యవహారంపై ఈ ఏడాది జనవరి 29న ప్రముఖ దినపత్రికలో ‘అడవిలో అక్రమ సామ్రాజ్యం’ పేరుతో కథనం ప్రచురితమైన నేపథ్యంలో ప్రభుత్వం స్పందించింది. దీనిపై విచారణ జరిపేందుకు జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్, ఎస్పీ మణికంఠ, ఫారెస్ట్‌ కన్జర్వేటర్‌ యశోదాబాయితో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ క్షేత్రస్థాయిలో జరిపిన విచారణలో పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు సుమారు 27.98 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించినట్టు నిర్ధారణకు వచ్చింది. అంతేకాకుండా, ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండా ఆ భూమిలో బోరును కూడా తవ్వినట్టు గుర్తించారు. ఈ అక్రమ కార్యకలాపాల వల్ల జీవవైవిధ్యానికి దాదాపు కోటి రూపాయలకు పైగా నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు.

ప్రస్తుతం అధికారులు ఆక్రమణకు గురైన అటవీ ప్రాంతం చుట్టూ హద్దు రాళ్లను ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈ ప్రక్రియ మరో వారంలోపు పూర్తవుతుందని సమాచారం. అనంతరం, ఈ కేసుకు సంబంధించి పాకాల కోర్టులో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

మరోవైపు, ఈ వ్యవహారంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించినట్టు తెలిసింది. నిందితులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆయన ఆదేశించిన నేపథ్యంలో, సంబంధిత అధికారులు దీనిపై తదుపరి చర్యల కోసం సమాలోచనలు జరుపుతున్నారు. ఈ అక్రమాలకు సహకరించినట్టుగా భావిస్తున్న ప్రభుత్వ అధికారుల వివరాలను కూడా ఆరా తీస్తున్నారని, వారిపై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :