విశాఖ ఎయిర్‌పోర్ట్ ఘటనపై అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఫైర్ అవుతున్నారు.. అసలు, మంత్రుల కాన్వాయ్‌పై దాడికి జనసేన అధినేత పవన్ కల్యాణే కారణం అంటున్నారు.. ఈ ఘటనపై స్పందించిన మంత్రి ఆదిమూలపు సురేష్..
మంత్రులు రోజా, జోగి రమేష్ , టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి పై జరిగిన దాడిని ఖండించారు.. ప్రజాస్వామ్యంలో దాడులు మంచివి కావని హితవుపలికిన ఆయన.. టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి సౌమ్యుడు… ఆయన పై దాడి హేయమైన చర్య అన్నారు. పవన్ కల్యాణ్ మాటతీరు వల్లే దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.. వైసీపీ నేతలపై దాడుల వెనుక జనసేన నేతల ప్రణాళిక ఉందనిపిస్తుందనే అనుమాలను వ్యక్తం చేసిన ఆయన.. ఉద్దేశ పూర్వకంగానే జనసేన దాడులు చేసిందని ఫైర్ అయ్యారు.
ఇక, మేం దాడుల సంస్కృతిని ప్రోత్సహిస్తే జనసేన నేతలు తిరగ గలరా.? అని ప్రశ్నించారు మంత్రి ఆదిమూలపు సురేష్.. విశాఖ గర్జన విజయవంతం అయ్యిందన్న ఆయన.. జనసేన నేతల దాడులతో విశాఖ పరిపాలన రాజధాని కాకుండా అడ్డుకోలేరన్నారు.. పవన్ కళ్యాణ్ ఎవరికో పల్లకి మోయడానికి ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. అసలు, విశాఖ గర్జన రోజే ఎందుకు పవన్ కల్యాణ్ విశాఖ టూర్ పెట్టుకున్నారు అని ప్రశ్నించారు. శాంతి భద్రతల సమస్య సృష్టిస్తే ఊరుకునేది లేదు.. దాడులు చేసిన వారిపై పోలీసుల చర్యలు తప్పవని హెచ్చరించారు మంత్రి ఆదిమూలపు సురేష్.