పదో తరగతి పరీక్ష ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. అయితే, ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి వెబ్‌సైట్‌లో పదో తరగతి ఫలితాలు అందుబాటులో ఉంటాయి. bse.telangana.gov.inతో పాటు పలు వెబ్‌సైట్లలో ఫలితాలు చూసుకోవచ్చు.ఈ సందర్భంగా మంత్రి సబిత మాట్లాడుతూ… మొత్తం 535 పాఠశాలలు 10 జీపీఏ సాధించాయని చెప్పారు. విద్యార్థుల పరంగా చూస్తే మొత్తం 2,10,647 మంది 10 జీపీఏ సాధించినట్లు ఆమె వివరించారు. పరీక్ష రుసుము చెల్లించిన 5,21,073 మందిని ఉత్తీర్ణులు చేసి గ్రేడ్లను ఖరారు చేశారు. కరోనా విజృంభణ కారణంగా ఈ ఏడాది కూడా పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. విద్యార్థులకు కొన్ని నెలల క్రితం వారి పాఠశాలల్లో నిర్వహించిన ఫార్మేటివ్ అసెస్‌మెంట్-1లో వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకుని మార్కులు ఇచ్చారు. తుది మార్కులు కేటాయించి గ్రేడ్లను ఖరారు చేశారు. విద్యార్థులకు ఆయా సబ్జెక్టులలో వచ్చిన మార్కుల ఆధారంగా గ్రేడింగ్, గ్రేడ్ పాయింట్లు ఇచ్చారు. అన్ని సబ్జెక్టులకు కలిపి గ్రేడ్ పాయింట్ యావరేజ్ ను నిర్ణయించారు.