హుజూరాబాద్ ఉప ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసిన పాడి కౌశిక్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. మరికాసేపట్లో ఆయన టీపీసీసీకి తన రాజీనామా లేఖను పంపనున్నట్టు సమాచారం. ఈ రోజు కౌశిక్ రెడ్డి ఓ కార్యకర్తతో మాట్లాడిన ఆడియో లీక్ కావడం కలకలం రేపింది. తనకు టీఆర్ఎస్ టికెట్ ఖాయమైందని ఆయన అందులో వ్యాఖ్యానించారు. ఈ ఆడియో టేప్ బయటకు వచ్చిన తరువాత టీపీసీసీ అప్రమత్తమైంది. వెంటనే కౌశిక్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది.
24 గంటల్లో దీనిపై సమాధానం చెప్పాలని ఆదేశించింది. ఆయన ఇచ్చే సమాధానం సంతృప్తికరంగా లేకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ పేర్కొంది. మరోవైపు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ నేతలు కౌశిక్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని టీపీసీసీకి లేఖ రాయడంతో.. కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకునేందుకే సిద్ధమైందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ తనపై చర్యలు తీసుకోవడానికి ముందుగానే కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నట్టు ప్రచారం జరుగుతోంది.