- నకిలీ విత్తనాల చెలామణిని అరికట్టాలి
- ముందస్తు ప్రణాళికతో నాణ్యమైన విత్తనాలు రైతులకు అందించాలి
- క్షేత్రస్థాయిలో అనుమానం వచ్చిన విత్తనాల శాంపిల్స్ ను వెంటనే పరీక్షించాలి.
- రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి
రైతుల ప్రయోజనాలను కాపాడడమే ప్రధాన లక్ష్యంగా అధికారులు పని చేయాలని , రాష్ట్రంలో ఎక్కడా నకిలీ విత్తనాలు చెలామణి కాకుండా అరికట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అధికారులకు సూచించారు.
మంగళవారం హైదరాబాద్ లోని సచివాలయం నుండి రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, డి.జి.పి. అంజనీ కుమార్, రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఉన్నతాధికారులతో కలిసి వానాకాలం సీజన్ ముందస్తు ఏర్పాట్లపై జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు,వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
తెలంగాణలో ప్రభుత్వం తీసుకున్న రైతు అనుకూల విధానాలతో వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయన్నారు.
రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ముందస్తు ప్రణాళికతో నాణ్యమైన ఎరువులు, విత్తనాలు సమయానికి అందించాలన్నారు.
తెలంగాణలో ఉన్న విత్తన ఉత్పత్తి పరిశ్రమకు ఇబ్బంది కలగకుండా, నకీలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపాలని, నకిలీ విత్తనాలు ఇతర రాష్ట్రాల నుంచి రాకుండా సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి నిఘా పెంచాలని మంత్రి తెలిపారు.
వానాకాలం పంటల సాగుకు అవసరమైన ఎరువులు, విత్తనాలు రైతులకు అందుబాటులో ఉండేలా ప్రణాళికాబద్ధ చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు.
నకిలీ, నాసిరకం విత్తనాలతో రైతులు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదన్నారు.
దేశ వ్యాప్తంగా అవసరమైన విత్తనాలలో అరవై శాతం విత్తనాలను తెలంగాణ రాష్ట్రమే సమకూరుస్తుందన్నారు.
నకిలీ విత్తనాల తయారీదారులు, వాటి విక్రేతలను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా, గడువు ముగిసిన విత్తనాలను, లైసెన్స్ లేకుండా విక్రయించే వాటిని, ఒక ప్రాంతంలో లైసెన్స్ కలిగి ఉండి, వేరే చోట విక్రయాలు జరిపే వారి పైనా చర్యలు చేపట్టాలని సూచించారు.
స్టాక్ రిజిస్టర్, బిల్ బుక్ నిర్వహణ వంటి చిన్న చిన్న లోపాలను గుర్తించిన సమయాల్లో వాటిని సవరించుకోవాల్సిందిగా డీలర్లకు సూచించాలని, ఆ మేరకు మార్పు రాని పక్షంలో నిబంధనలను అనుసరిస్తూ చర్యలు చేపట్టాలన్నారు.
పదేపదే నకిలీ విత్తనాల దందాను నిర్వహించే వారిని గుర్తిస్తూ, అవసరమైతే పీ.డీ యాక్టు పెట్టాలని సూచించారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్,జిల్లా ఎస్పీ అధికారులకు పలు సూచనలు చేశారు.
జిల్లా కలెక్టర్ శరత్ మాట్లాడుతూ జిల్లాలో నకిలీ విత్తనాలతో
ఏ ఒక్క రైతు
నష్ట పోకూడదన్నారు.
నకిలీ విత్తనాల విషయంలో రైతులను చైతన్య పర్చాలన్నారు.
తనిఖీల సమయంలో టెస్ట్ కిట్స్ ను తీసుకెళ్లాలని, రైతులకు ఆయా విత్తనాలు,వారి భూములు ఏవిధమైన పంటకు అనువుగా వున్నాయి అన్న
విశయాలపై వ్యవసాయ అధికారులు సలహాలు,సూచనలు చేయాలన్నారు.
వచ్చే వానాకాలం జిల్లాలో వివిధ పంటల సాగుకు అవసరమైన ఆయా విత్తనాలు అందుబాటులో ఉండేలా తగిన చర్యలు చేపట్టాలని , జిల్లాలో ఉన్న టాస్క్ ఫోర్స్ బృందాలు క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని , అనుమానిత విత్తనాలను వెంటనే శాంపిల్స్ చెక్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
విత్తన డీలర్లు దుకాణాల్లో తప్పనిసరిగా లైసెన్స్ ప్రదర్శించాలని, విత్తనాల విక్రయ బిల్లు పూర్తి వివరాలతో అందించాలని, స్టాక్ రిజిస్టర్ నిర్వహణ, ఫారం డీ సమర్పణ, లైసెన్స్ రెన్యువల్ చేయడం, షాపు మార్పు వివరాలు లైసెన్స్ లో నమోదు వంటివి సరి చేసుకోవాలని ఆయా అధికారులు విత్తన డీలర్లకు, వ్యాపారస్థులకు తెలియజేసి సవరించు కునేలా చూడాలని
సూచించారు.
ఎస్పీ రమణ కుమార్ మాట్లాడుతూ
జిల్లాలో ఆకస్మిక తనీఖీల సమయంలో గడువు తేది ముగిసిన విత్తనాలు అమ్మడం, లైసెన్స్ లేకుండా విక్రయాలు చేపట్టడం, నకిలీ విత్తనాలు ఉండటం వంటి అంశాల పట్ల నిబంధనల మేరకు కఠినంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. ఎవేని న్యాయసలహాలు,
సూచనలకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను సంప్ర దించవచ్చని తెలిపారు.
జిల్లాలో వ్యవసాయ విస్తరణ అధికారులు, వ్యవసాయ అధికారులు, టాస్క్ ఫోర్స్ బృందాలు క్షేత్రస్థాయిలో రైతుల నుంచి ఎప్పటికప్పుడు సమాచారంతెలుసుకుంటూ నకీలీ విత్తనాలు అరికట్టడంలో పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కోరారు.
పోలీస్, వ్యవసాయ ఉద్యాన ,ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లాలో నకిలీ విత్తనాల విక్రయాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా నుండి ఎస్పి రమణ కుమార్, వ్యవసాయ శాఖ జెడి నరసింహారావు, ఉద్యాన శాఖ డిడి వెంకటేశ్వర్లు, ఏడీఏలు, ఏవోలు, ఉద్యాన శాఖ అధికారులు, డి.ఎస్.పి బాలాజీ, తదితరులు పాల్గొన్నారు.