పార్వతీపురం మన్యం జిల్లా : జేఈఈ మెయిన్స్ లో మంచి ర్యాంకులు సాధించిన గిరిజన గురుకులాల విద్యార్థులను జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సన్మానించారు. పార్వతీపురం మన్యం జిల్లా జోగింపేట గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు జాతీయ స్థాయి ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష జేఈఈ మెయిన్స్ లో ప్రతిభ కనబరచడం పట్ల కలెక్టర్ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
జాతీయస్థాయిలో 137, 900, 2,864వ ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఎస్.నందవర్ధన్ నిహాల్, ఎస్.అఖిల్, పి.జగదీశ్వరరావులకు కలెక్టర్ దుస్సాలువాతో ఘనంగా సత్కరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని కలెక్టర్ ఈ సందర్బంగా తెలిపారు. కృషి,పట్టుదల ఉంటే సాధించలేనిది ఉండదని ఉద్బోదించారు. రాబోయే అడ్వాన్స్ పరీక్షలలో కూడా మంచి ప్రతిభను కనబరచి జిల్లాకు మంచి పేరును తీసుకురావాలని కలెక్టర్ ఆకాంక్షించారు.
విద్యార్థుల కృషి, గురుకులాల నాణ్యమైన బోధన విధానం, తల్లిదండ్రుల ప్రోత్సాహం వలన వీరు జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చగలిగారని, విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం అన్ని విధాలుగా తోడుగా ఉంటుందని తెలిపారు.
జోగింపేట గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ బి.ధర్మారావు మాట్లాడుతూ ఐటీడిఏ ప్రాజెక్ట్ అధికారి అశుతోష్ శ్రీ వాస్తవ విద్యార్థుల కొరకు రూ.40 వేలు ఖరీదు చేసే పుస్తకాలను ఉచితంగా అందించారని అన్నారు. దానివలన విద్యార్థులకు ఎంతో మేలు జరిగిందని, ఈ పాఠశాల నుంచి 12 మంది విద్యార్థులు జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించడమే కాకుండా అడ్వాన్స్ పరీక్షలకు ఎంపిక అయ్యారని తెలిపారు. ఈ విద్యార్థులందరూ అడ్వాన్స్ పరీక్షలలో కూడా తప్పక విజయం సాధిస్తారనే నమ్మకం ఉందని పేర్కొన్నారు.
జేఈఈ మెయిన్స్ లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్డులు ఎస్.నంద వర్ధన్ నిహాల్ 98, ఎస్.అఖిల్ 93, పి.జగదీశ్వరరావు 84, కె.అభినందనరావు 84, ఎ.లోకేష్ 75 శాతం మార్కులు సాధించారని ప్రిన్సిపాల్ కలెక్టర్ కు వివరించారు.