ఆంధ్రప్రదేశ్లో రేషన్ పంపిణీ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. జూన్ 1 నుంచి చౌక ధరల దుకాణాల (రేషన్ షాపుల) ద్వారానే రేషన్ సరుకుల సరఫరా జరుగుతుందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. అయితే, 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు, దివ్యాంగులకు మాత్రం గతంలో మాదిరిగానే ఇంటికే నేరుగా సరుకులు అందజేస్తామని ఆయన తెలిపారు. మంత్రివర్గ సమావేశం అనంతరం, కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను మంత్రి పార్థసారధితో కలిసి నాదెండ్ల మనోహర్ మీడియాకు వివరాలు వెల్లడించారు.
గతంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 29 వేల చౌక దుకాణాల ద్వారా బియ్యం సహా ఇతర నిత్యావసర సరుకుల పంపిణీ సమర్ధవంతంగా జరిగేదని మంత్రి గుర్తుచేశారు. అయితే, గత వైసీపీ ప్రభుత్వం మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ల (ఎండీయూ) పేరిట ఈ వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిందని ఆయన ఆరోపించారు. “9,260 మొబైల్ వాహనాల కోసం అనవసరంగా రూ.1860 కోట్లు వృధా చేశారు. ఈ విధానం వల్ల లబ్ధిదారులు తమ ఇబ్బందులను ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి నెలకొంది. ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా దాదాపు 30 శాతం మందికి రేషన్ అందడం లేదని మా దృష్టికి వచ్చింది” అని నాదెండ్ల మనోహర్ వివరించారు.
రేషన్ సరఫరాకు వాహనాలు వచ్చిన తర్వాత జవాబుదారీతనం లోపించిందని, సరుకులు ఎటు వెళుతున్నాయో కూడా తెలియని దుస్థితి ఏర్పడిందని మంత్రి విమర్శించారు. ఈ వాహనాల ఆపరేటర్లపై వందల సంఖ్యలో క్రిమినల్ కేసులు నమోదయ్యాయని, బియ్యం అక్రమ రవాణా కోసం ఏకంగా ఒక గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసుకున్నారని ఆయన ఆరోపించారు.
“రాష్ట్రంలో 29 వేల రేషన్ దుకాణాలు ఉంటే, కేవలం 9 వేల వాహనాలు ఎలా సరిపోతాయి? దొంగ లెక్కలు చూపించి పెద్ద ఎత్తున బియ్యాన్ని పక్కదారి పట్టించారు. ఒక్కో వాహనానికి నెలకు రూ.27 వేల చొప్పున పౌరసరఫరాల శాఖ చెల్లిస్తూ వచ్చింది. ఇన్ని లోపాలను గుర్తించి, అనేక అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఈ ఎండీయూ వాహనాల విధానాన్ని రద్దు చేయాలని నిర్ణయించాం,” అని ఆయన తెలిపారు.
కొత్త విధానం ప్రకారం, ప్రతి నెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు చౌక ధరల దుకాణాలు ప్రజలకు అందుబాటులో ఉంటాయని, జూన్ 1 నుంచి రేషన్ పంపిణీ కేవలం ఈ దుకాణాల ద్వారానే జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న 9,260 వాహనాలను ఆయా లబ్ధిదారులకు ఉచితంగా బదలాయించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఈ నిర్ణయంతో ప్రజాధనం ఆదా అవ్వడమే కాకుండా, పంపిణీ వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.