పంజాబ్ : అమృత్ సర్ లోని పవిత్ర స్వర్ణ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ పన్నిన భారీ కుట్రను భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టిందని ఆర్మీ ఉన్నతాధికారులు తాజాగా వెల్లడించారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా, పాకిస్థాన్ ప్రయోగించిన క్షిపణులను గుర్తించేందుకు చరిత్రలో తొలిసారిగా స్వర్ణ దేవాలయంలో విద్యుత్ దీపాలను ఆర్పివేయాల్సి వచ్చిందని వైమానిక దళ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ సుమర్ ఇవాన్ తెలిపారు.
ఈ ఘటనపై లెఫ్టినెంట్ జనరల్ సుమర్ ఇవాన్ మరిన్ని వివరాలు వెల్లడిస్తూ, “దేశంలో అంతర్గత అశాంతిని రెచ్చగొట్టేందుకు పాకిస్థాన్ ఇక్కడి ప్రార్థనా స్థలాలపై దాడులకు పాల్పడవచ్చని మేం ముందే అంచనా వేశాం. మా అంచనాలకు అనుగుణంగానే, పంజాబ్‌లోని స్వర్ణ దేవాలయంపై దాడికి పాక్ కుట్ర పన్నుతున్నట్లు నిఘా వర్గాల నుంచి మాకు కచ్చితమైన సమాచారం అందింది,” అని అన్నారు.
“అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయానికి ముప్పు పొంచి ఉందని తెలియజేయగానే, ఆలయ నిర్వాహకులు మాకు అన్ని విధాలా సహకరించారు. ఆయుధాలతో ఆలయంలోకి ప్రవేశించేందుకు అక్కడి ప్రధాన గ్రంథి (గురుద్వార్ పర్యవేక్షకుడు) సైనికులకు ప్రత్యేకంగా అనుమతులు మంజూరు చేశారు. ఇది చాలా కీలకమైన విషయం” అని ఆయన గుర్తుచేసుకున్నారు. “దేవాలయంలోని ముఖ్యమైన ప్రదేశాల్లో మా సైనికులు ఆయుధాలతో మోహరించడానికి అనుమతి లభించింది. అంతకుమించి, పాక్ ప్రయోగించే క్షిపణులను స్పష్టంగా గుర్తించడానికి వీలుగా స్వర్ణదేవాలయంలోని లైట్లను ఆపివేయించారు. బహుశా చరిత్రలో అన్ని సంవత్సరాలుగా వెలుగుతున్న ఆ లైట్లను ఆపివేయడం ఇదే మొదటిసారి కావచ్చు. వారి సహకారానికి మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం” అని లెఫ్టినెంట్ జనరల్ సుమర్ ఇవాన్ పేర్కొన్నారు.
‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత పాకిస్థాన్ మరింత కక్ష పెంచుకుని స్వర్ణ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకుందని మేజర్ జనరల్ కార్తిక్ సి శేషాద్రి తెలిపారు. “మన ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ దళాలు పాకిస్థాన్ సైన్యం పన్నిన కుట్రలను సమర్థవంతంగా తిప్పికొట్టాయి. మన పవిత్ర స్వర్ణ దేవాలయంపై చిన్న గీత కూడా పడకుండా అన్ని డ్రోన్లు, క్షిపణులను గాల్లోనే కూల్చివేశారు” అని ఆయన వివరించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పాకిస్థాన్ వందలాది డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించిందని, మన ఎస్-400, ఆకాశ్ వంటి అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థలు వాటిని అద్భుతంగా ఎదుర్కొని, నేలమట్టం చేశాయని మేజర్ జనరల్ శేషాద్రి వెల్లడించారు.