కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా: కాగజ్‌నగర్‌లో యువజన కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాగజ్‌నగర్‌లోని ఎమ్మెల్సీ దండే విఠల్ నివాసం వద్ద జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బుర్స వెంకటేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దండే విఠల్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి యువతే వెన్నెముక అని ఆయన అన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల పాత్ర కీలకమని పేర్కొన్నారు.
క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు యువత చురుగ్గా పనిచేయాలని దండే విఠల్ పిలుపునిచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారం కోసం పోరాడాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కాగజ్‌నగర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చునర్కర్ మహేష్, జిల్లా ఉపాధ్యక్షుడు యూసఫ్ ఖాన్‌తో పాటు వివిధ మండలాలకు చెందిన యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాయకులు, కార్యకర్తలు పార్టీ జెండాలతో ఉత్సాహంగా నినాదాలు చేస్తూ ఆవిర్భావ వేడుకలను నిర్వహించారు.








