contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

గుండ్లపల్లి – పొత్తూరు రోడ్డుపై రాజకీయ వేడి.. ఎమ్మెల్యేకు బీజేపీ సవాల్!

గన్నేరువరం, కరీంనగర్ జిల్లా: కరీంనగర్ జిల్లాలో రహదారి నిర్మాణం అంశం రాజకీయ వేడి రాజేస్తోంది. గన్నేరువరం మండలం గుండ్లపల్లి నుంచి ఇల్లంతకుంట మండలం పొత్తూరు వరకు బీటీ డబుల్ రోడ్డు నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు.

గుండ్లపల్లి వద్ద రాజీవ్ రహదారిపై బీజేపీ గన్నేరువరం మండల నాయకులు బైఠాయించి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. రోడ్డు నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. ప్రజలు ఏళ్లుగా రహదారి సమస్యతో ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఇదే రోడ్డు నిర్మాణం కోసం పోరాడిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రోడ్డు నిర్మాణం విషయంలో ఎమ్మెల్యే తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

ప్రజల రాకపోకలకు కీలకమైన ఈ మార్గాన్ని డబుల్ రోడ్డుగా అభివృద్ధి చేయడం వల్ల గన్నేరువరం, ఇల్లంతకుంట మండలాల పరిధిలోని పలు గ్రామాల ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని నాయకులు పేర్కొన్నారు. రహదారి అధ్వానంగా ఉండటంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

బీటీ డబుల్ రోడ్డు నిర్మాణ పనులను వచ్చే నెల రోజుల్లోగా ప్రారంభించకపోతే నియోజకవర్గ వ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని బీజేపీ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రజల సమస్య పరిష్కారమయ్యే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

బీజేపీ ధర్నా కారణంగా రాజీవ్ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వాహనాలు నెమ్మదిగా కదలడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు తిప్పర్తి నికేశ్, మానకొండూరు నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ ముత్యాల జగన్‌రెడ్డి, గునుకుల కొండాపూర్ సర్పంచ్ సొల్లు అజయ్ వర్మ, బీజేపీ రాష్ట్ర మాజీ కౌన్సిల్ మెంబర్ విలాసాగరం రామచంద్రం, బీజేపీ జిల్లా సీనియర్ నాయకులు ఏలేటి చంద్రారెడ్డి, కిసాన్ మోర్చా మాజీ జిల్లా అధ్యక్షుడు అన్నాడి రాజిరెడ్డి, గన్నేరువరం వార్డు సభ్యుడు మచ్చ సాయి కృష్ణ, మండల నాయకులు సందవేణి ప్రశాంత్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :