జగిత్యాల: ఆగస్టు 15న నిర్వహించనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జగిత్యాల జిల్లా పోలీసులు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లాలోని కీలక ప్రాంతాల్లో ముందస్తు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల, మెట్పల్లి పట్టణాల్లో బాంబ్ డిస్పోజల్ టీమ్, శిక్షణ పొందిన పోలీసు జాగిలాలతో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ప్రజలు అధికంగా సంచరించే ప్రాంతాలు, ప్రభుత్వ కార్యాలయాలు, బస్స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మార్కెట్లు తదితర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగానే ఈ తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. అనుమానాస్పద వస్తువులు, వాహనాలు, బ్యాగులు, పార్సిళ్లపై ప్రత్యేక దృష్టి సారించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ ప్రజలు తమ పరిసరాల్లో గుర్తుతెలియని వ్యక్తులు, అనుమానాస్పద వాహనాలు, బ్యాగులు, పార్సిళ్లు లేదా ఇతర అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. అనుమానాస్పద వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ స్వయంగా పరిశీలించవద్దని, వాటికి దూరంగా ఉండి పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంతంగా జరిగేలా అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ తెలిపారు.








