contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

కాకినాడలో అంధకారం .. పట్టించుకోని అధికారులు

కాకినాడ: నాలుగేళ్లుగా ఎన్నికలు లేకపోవడం, సమర్థవంతమైన అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో కాకినాడ నగర పాలక సంస్థ పరిధిలో పౌర సౌకర్యాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని ప్రముఖ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు విమర్శించారు.

బుధవారం రాత్రి ఆయన కాగడా చేపట్టి గాఢాంధకారంలో ఉన్న తోట గోపాలకృష్ణ పార్కులోని మహావీర్ విగ్రహం వద్ద జాతీయ జెండాతో నిరసన తెలిపారు. కలెక్టరేట్‌కు కేవలం 200 మీటర్ల దూరంలో ఉన్న ఈ పార్కు కార్పొరేషన్ నిర్లక్ష్యం కారణంగా అసాంఘిక కార్యకలాపాలకు, డ్రగ్స్ వినియోగానికి కేంద్రంగా మారే పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు.

పూజించాల్సిన మహావీర్ విగ్రహం చీకటిలో మగ్గుతోందని, పార్కు నామకరణ బోర్డు ఏర్పాటు చేయలేదని, గ్రీనరీ నిర్వహణ కూడా సరిగా లేదని రమణరాజు అన్నారు. మందుబాబులు పార్కు ప్రహరీలను ధ్వంసం చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. నగర ముఖద్వారంలో అంబేద్కర్, బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహాల మధ్య ఇలాంటి దుస్థితి కొనసాగడం దురదృష్టకరమన్నారు.

నగరంలోని స్లమ్ ప్రాంతాల్లో సుమారు 50 శాతం వీధి దీపాలు వెలగడం లేదని ఆయన పేర్కొన్నారు. నాలుగు రోడ్ల కూడళ్లలోని దీపాలకు మాత్రమే మరమ్మతులు చేస్తున్నారని విమర్శించారు. నాలుగు ప్రధాన పార్కులు మినహా సుమారు 18 పార్కుల్లో అంధకారం నెలకొందని తెలిపారు. వివేకానంద పార్కు, బోటు క్లబ్, శ్రీనగర్, గాంధీనగర్ తదితర ప్రధాన పార్కుల్లో సైతం వీధి దీపాల నిర్వహణ సక్రమంగా లేదని అన్నారు.

ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాన కూడళ్లలోని మహానాయకుల విగ్రహాలు స్పష్టంగా కనిపించేలా ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ ఆ దిశగా చర్యలు కనిపించడం లేదని రమణరాజు అన్నారు. జవహర్ వీధిలోని వివేకానంద పార్కు తూర్పు ముఖద్వారం వద్ద ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి కరోనా లాక్‌డౌన్ అనంతరం ప్రత్యేక ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేయడం పూర్తిగా విస్మరించారని ఆరోపించారు.

ట్రాఫిక్ వాహనాల వెలుగులు, అరకొర వీధి దీపాల కాంతిలో జాతీయ నాయకుల విగ్రహాలు నగరవ్యాప్తంగా కనిపించడం బాధాకరమన్నారు. ఆనందభారతి పార్కు పరిస్థితి కూడా ఇదే విధంగా ఉందని తెలిపారు. పోలీస్ స్టేషన్లు, కార్యాలయ ప్రాంగణాలు, కలెక్టరేట్ ఎదురుగా ఉన్న జిల్లా కోర్టు, సబ్‌జైలు బయట, ప్రధాన గేట్లు తదితర ప్రాంతాల్లో కూడా వీధి దీపాల నిర్వహణ సక్రమంగా లేదని పేర్కొన్నారు. ముఖ్యమైన వీధి స్తంభాలకు ఇరువైపులా హైవాట్స్ విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

సిటీ ఎమ్మెల్యే, రూరల్ ఎమ్మెల్యే, ఎంపీ, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీ కార్యాలయాల నుంచి ఆదేశాలు వస్తే తప్ప కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది పనులు చేయడం లేదని రమణరాజు ఆరోపించారు. వీధి దీపాలు, డ్రైనేజీ క్లీనింగ్, పారిశుద్ధ్యం తదితర సమస్యలను కూడా ప్రజాప్రతినిధుల కార్యాలయాల నుంచి ఆదేశాలు వచ్చినప్పుడే పట్టించుకుంటున్నారని విమర్శించారు.

కార్పొరేషన్ పరిధిలో కనీసం 90 శాతం వీధి దీపాలు నిరంతరం వెలిగేలా నిర్వహణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమస్య పరిష్కారం కాకపోతే ప్రతి రాత్రి కాగడాతో, జాతీయ జెండాతో వెలగని వీధి దీపాల వద్ద పాదయాత్ర చేపడతానని దూసర్లపూడి రమణరాజు హెచ్చరించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :