తూప్రాన్ : మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని చేగుంట మండల కేంద్రం శివారులో గల వడియారం గ్రామ పంచాయతీలో వనమహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపు లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, పంచాయతీ సిబ్బంది పాల్గొని మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో టీ. చిన్నారెడ్డి, ఎంపీఓ ఏ. ప్రకాష్, ఏపీఓ టీ. శ్వేత, ఫారెస్ట్ సెక్షన్ అధికారి కిరణ్ కుమార్, బీట్ ఆఫీసర్ శ్రీవల్లి, పంచాయతీ కార్యదర్శి, వడియారం గ్రామ సర్పంచ్ అంకన్నగారి సాయి కుమార్ గౌడ్‌తో పాటు పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. నాటిన మొక్కలను సంరక్షిస్తూ అవి భవిష్యత్తులో పెద్ద వృక్షాలుగా ఎదిగేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. గ్రామాల్లో పచ్చదనం పెంపుతో పాటు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
గ్రామాల అభివృద్ధిపై అధికారుల సమీక్ష
అనంతరం మధ్యాహ్నం గ్రామీణ అభివృద్ధిపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు, ఎంపీడీవో టీ. చిన్నారెడ్డి, ఎంపీఓ ఏ. ప్రకాష్, ఏపీఓ టీ. శ్వేత సమక్షంలో మండలంలోని పలు గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడం, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడం వంటి అంశాలపై చర్చించారు. గ్రామాల అభివృద్ధికి అధికారులు సూచించిన సలహాలు, మార్గదర్శకాలను పంచాయతీ పాలకవర్గాలు మరియు కార్యదర్శులు సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు సూచించారు.
ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పనిచేయాలని అధికారులు పేర్కొన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి వాటికి అనుగుణంగా అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.








