కాగజ్‌నగర్, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా: ప్రజలను అధికారులపై దాడులకు ఉసిగొల్పడం నాయకత్వం కాదని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ముందుండి పోరాడటమే నిజమైన నాయకత్వమని సిర్పూర్ నియోజకవర్గ నాయకుడు రావి శ్రీనివాస్ అన్నారు.
కాగజ్‌నగర్‌లోని తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పెంచికల్‌పేట్ మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అటవీ అధికారులపై తిరగబడాలని ప్రజలను రెచ్చగొట్టారని ఆరోపించారు. ఈ అంశంపై ఇప్పటికే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
కౌటాల మండలం కనికి గ్రామంలో అటవీ అధికారులపై జరిగిన దాడికి ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలే కారణమని రావి శ్రీనివాస్ ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించి శ్రీనివాస్ గౌడ్‌ను A1గా చేర్చిన పోలీసులు, ప్రజలను రెచ్చగొట్టారని ఆరోపిస్తున్న ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబును కూడా A2గా చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేయకపోతే కోర్టును ఆశ్రయించి ప్రైవేట్ కేసు దాఖలు చేస్తామని రావి శ్రీనివాస్ హెచ్చరించారు. అదే సమయంలో అటవీ శాఖ చర్యల కారణంగా 3 నుంచి 4 ఎకరాల్లో సాగు చేసుకుంటున్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులు, గిరిజనులు, స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు రానున్న రోజుల్లో సిర్పూర్ నియోజకవర్గంలో పాదయాత్ర చేపడతామని ఆయన తెలిపారు. గడపగడపకూ వెళ్లి ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుని, వాటి పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
ఈ విలేకరుల సమావేశంలో నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.








