గన్నేరువరం, కరీంనగర్ జిల్లా : సోషల్ మీడియాలో ప్రజాప్రతినిధిని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడంతో పాటు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు, వ్యాఖ్యలు చేసిన ఇద్దరు వ్యక్తులపై గన్నేరువరం పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గన్నేరువరం మండలం జంగపల్లి గ్రామానికి చెందిన తాడూరు వంశీకృష్ణ రెడ్డి, గుండ్లపల్లి గ్రామానికి చెందిన ముదిగంటి మహేందర్ రెడ్డి సోషల్ మీడియాలో మానకొండూరు నియోజకవర్గ ఎమ్మెల్యేను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినట్లు ఫిర్యాదు అందింది. అంతేకాకుండా ఆయా వ్యాఖ్యలు వర్గాల మధ్య విద్వేషాలు సృష్టించేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ మేరకు గన్నేరువరం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొడ్డు సునీల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా సంబంధిత ఇద్దరు వ్యక్తులతో పాటు సోషల్ మీడియా వాట్సాప్ గ్రూపుల అడ్మిన్లపై కూడా కేసు నమోదు చేసినట్లు గన్నేరువరం ఎస్ఐ జి. నరేందర్ రెడ్డి తెలిపారు.
సోషల్ మీడియాలో బాధ్యతారహితంగా, రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం లేదా ఇతరుల ప్రతిష్ఠకు భంగం కలిగించేలా పోస్టులు చేయడం చట్టపరమైన చర్యలకు దారితీస్తుందని పోలీసులు హెచ్చరించారు. సోషల్ మీడియా వేదికలను బాధ్యతాయుతంగా వినియోగించాలని సూచించారు.








