మనోహరాబాద్, తూప్రాన్ : మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్ గ్రామ శివారులోని ఓ గ్యాస్ గోదాంపై సివిల్ సప్లై అధికారులు, పోలీసులు సంయుక్తంగా మెరుపు దాడులు నిర్వహించారు. అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్నారన్న సమాచారంతో చేపట్టిన ఈ తనిఖీల్లో భారీగా గ్యాస్ సిలిండర్లు పట్టుబడ్డాయి.
అధికారుల వివరాల ప్రకారం.. కాళ్లకల్ గ్రామ శివారులోని ఓ గోదాంలో అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో సివిల్ సప్లై అధికారులు, పోలీసులు సంయుక్తంగా గోదాంలో తనిఖీలు చేపట్టారు.
ఈ తనిఖీల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 296 గ్యాస్ సిలిండర్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు సివిల్ సప్లై అధికారులు తెలిపారు. గోదాంలో గ్యాస్ రీఫిల్లింగ్‌కు సంబంధించిన కార్యకలాపాలు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలపై అధికారులు తదుపరి విచారణ చేపట్టారు.
అనుమతులు లేకుండా గ్యాస్ నిల్వ చేయడం, రీఫిల్లింగ్ చేయడం వంటి చర్యలు ప్రజల భద్రతకు ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నారు. సిలిండర్ల స్వాధీనం అనంతరం గోదాం నిర్వాహకులపై నిబంధనల మేరకు చర్యలు తీసుకునే ప్రక్రియ కొనసాగుతున్నట్లు సమాచారం.








