మెట్‌పల్లి : జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలో ఆక్రమణదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కళాకారులు శనివారం మున్సిపల్ కార్యాలయం ఎదుట మౌన దీక్ష చేపట్టారు.
ముందుగా మెట్‌పల్లి పట్టణంలోని చావిడి చౌరస్తాలో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సుమారు 100 మంది కళాకారులు మున్సిపల్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన దీక్ష శిబిరానికి చేరుకుని నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా కళాకారులు మాట్లాడుతూ.. పట్టణంలో ఆక్రమణలపై సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆక్రమణల సమస్యను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
అధికారులు స్పందించకపోతే పట్టణంలోని పాత బస్టాండ్, శాస్త్రి చౌరస్తాలో భారీ ధూంధాం కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం రిలే నిరాహార దీక్షలు చేపట్టి సంబంధిత ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మెట్‌పల్లి డివిజన్ సాధన సమితి అధ్యక్షుడు తోకల సత్యనారాయణ, జిల్లా రంగస్థల కళాకారుల ఐక్య వేదిక కన్వీనర్ కోటగిరి వెంకటస్వామి, లలిత కళా సమితి అధ్యక్షుడు గోధూరు మురళి, వర్కింగ్ ప్రెసిడెంట్ మట్టెల గంగాధర్, ప్రధాన కార్యదర్శి కోటగిరి చైతన్య, నాంపల్లి గట్టయ్య తదితరులు పాల్గొన్నారు.








