పల్నాడు జిల్లా : తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులతో పాటు చోరీ సొత్తును స్వీకరిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి సుమారు 362 గ్రాముల బంగారు ఆభరణాలు, 5.9 కిలోల వెండి వస్తువులు, రూ.1.02 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పల్నాడు జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లి, ఐపీఎస్ తెలిపారు.
ఎడ్లపాడు, నాదెండ్ల, చిలకలూరిపేట అర్బన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో తాళం వేసిన ఇళ్లలో జరుగుతున్న చోరీలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఎడ్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన క్రైమ్ నంబర్ 175/2026, BNS సెక్షన్లు 331(4), 305(a) కేసు దర్యాప్తులో నిందితుల వివరాలు వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
నిందితులు వీరే..
పోలీసుల వివరాల ప్రకారం..
- వెన్న దుర్గ దినేష్ @ సాయి (29) – మంగళగిరి టౌన్, గుంటూరు జిల్లా
- గుంజి యేసు రాజ (24) – ఎడ్లపాడు
- షేక్ నాగూర్ బాష @ చోర్ బాషా (20) – ఎడ్లపాడు
వీరితో పాటు చోరీ చేసిన బంగారు, వెండి వస్తువులను తాకట్టు పెట్టించుకునే వ్యక్తిగా గుర్తించిన యలమద్ది నాగరాజు (43), ఆత్మకూరు గ్రామం, మంగళగిరి మండలాన్ని కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
పోలీసుల విచారణలో నిందితులు చెడు వ్యసనాలకు అలవాటు పడి, సులభంగా డబ్బు సంపాదించి జల్సాలు చేసేందుకు దొంగతనాలకు పాల్పడినట్లు వెల్లడైందని ఎస్పీ తెలిపారు. ప్రధాన నిందితుడు దుర్గ దినేష్‌పై గతంలో సుమారు 12 దొంగతనం కేసులు ఉన్నట్లు, మరో నిందితుడు యేసు రాజ గతంలో దొంగతనం కేసులో జైలుకు వెళ్లి వచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు.
తాళం వేసిన ఇంటిని లక్ష్యంగా చేసుకుని చోరీ
పోలీసుల కథనం ప్రకారం.. ఎడ్లపాడుకు చెందిన బచ్చు పార్వతి నాగలక్ష్మి తన ఇద్దరు కుమారులు హైదరాబాద్, బెంగళూరులో ఉద్యోగాలు చేస్తుండటంతో ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నారు. సెప్టెంబర్ 3న హైదరాబాద్ వెళ్లే ముందు ఇంటికి తాళం వేసి, బంగారు, వెండి ఆభరణాలు, నగదును ఇనుప లాకర్‌లో భద్రపరిచారు.
సెప్టెంబర్ 9 రాత్రి ఇంటి గేటు, తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించిన బంధువులు ఆమెకు సమాచారం అందించారు. వారు ఇంటిని పరిశీలించగా గేటు, తలుపులు, బీరువాల తాళాలు పగులగొట్టి ఉండటంతో పాటు ఇనుప లాకర్ కనిపించలేదు. ఇంట్లో వస్తువులు చిందరవందరగా కనిపించాయి.
సెప్టెంబర్ 10 ఉదయం ఇంటికి చేరుకున్న ఫిర్యాదుదారు పరిశీలించగా సుమారు 401 గ్రాముల బంగారు ఆభరణాలు, 5.442 కిలోల వెండి వస్తువులు, రూ.2 లక్షల నగదు, KVP బాండ్లు కనిపించలేదని గుర్తించారు. మొత్తం చోరీకి గురైన ఆస్తి విలువ సుమారు రూ.15 లక్షలు ఉంటుందని ఫిర్యాదు చేయడంతో ఎడ్లపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
రెండు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు
పల్నాడు జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లి ఆదేశాల మేరకు నరసరావుపేట డీఎస్పీ ఎం. హనుమంతరావు పర్యవేక్షణలో చిలకలూరిపేట రూరల్ సీఐ బి. సుబ్బనాయుడు, సీసీఎస్ సీఐ ఎం.వి. చరణ్ ఆధ్వర్యంలో ఎడ్లపాడు ఎస్సై టి. శివరామకృష్ణ, నాదెండ్ల ఎస్సై ఆర్. వెంకటేశ్వరరావు, సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
నిందితుల కోసం గాలింపు చేపట్టిన ప్రత్యేక బృందాలు నాదెండ్ల మండలం ఇడ్లపాడు అడ్డరోడ్డు వద్ద అనుమానాస్పదంగా ఉన్న A2, A3, A4లను గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించినట్లు పోలీసులు తెలిపారు. వారి నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు. అనంతరం కేసులో మిగిలిన నిందితుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
నిందితుల అరెస్టు, చోరీ సొత్తు స్వాధీనంలో కీలకంగా పనిచేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.








